బస్సు డ్రైవర్‌, ప్రయాణికుడు గొడవ..నీటిలో కలిసిపోయిన 19 మంది ప్రాణాలు

బస్సు డ్రైవర్‌, ప్రయాణికుడు గొడవ పడ్డారు. ఆతరువాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫలితం. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూసుకెళ్లింది. క్షణాల్లోనే 19 మంది ప్రయాణికుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. సౌత్‌వెస్ట్‌ చైనాలోని చొంగింగ్‌లో జరిగిన ప్రమాద ఘటన అందరిని షాక్‌కు గురి చేస్తోది.

నాలుగు రోజుల క్రితం యాంగ్‌జే నదిపై ఉన్న బ్రిడ్జి మీద నుంచి బస్సు ప్రయాణిస్తోంది. అంతలోనే ఓ ప్యాసింజర్‌ బస్సు ఆపాలంటూ రిక్వెస్ట్‌చేశాడు. కానీ డ్రైవర్‌ బస్సు ఆపేందుకు నిరాకరించాడు. ఎంత బతిమాలిన వినకపోవడంతో ఆ ప్రయాణికుడికి చిర్రెత్తుకొచ్చింది. తన దగ్గరున్న సెల్‌ఫోన్‌తో డ్రైవర్‌ తలపై విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో బస్సుపై డ్రైవర్‌ కంట్రోల్‌ కోల్పోయాడు. దీంతో అప్పటిదాకా రోడ్డు మీదు ఉన్న బస్సు క్షణాల్లో నదిలోతేలిపోయింది. దీంతో 19 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా విడుదలైన సీసీ ఫుటేజ్‌లో ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. ఆ రోజు బస్సులో జరిగిన సంఘటన మొత్తం బస్సు బ్లాక్‌బాక్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌లో రికార్డైంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సులో గొడవ జరిగిన తీరు చూస్తే…బస్సు డ్రైవర్‌ కోపంతో కావాలనే స్టీరింగ్‌ను తిప్పాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు రోజుల పాటు సహాయక చర్యలు అనంతరం నదిలోనుంచి బస్సు బయటకు తీశారు అధికారులు. గల్లంతైన మృతదేహాలను వెలికి తీశారు.