కేంద్రం కీలక నిర్ణయం.. 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం

ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడే చిన్న తరహా పరిశ్రమలకు ఉపయోగపడేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం అందించేలా కొత్త పథకం తీసుకువచ్చింది. MSMEలకు మద్దతునిచ్చే కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించారు.

చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు ప్రధాని మోడీ దీపావళి కానుక ప్రకటించారు. జీఎస్‌టీ నమోదిత సంస్థలకు కొత్త వెబ్‌సైట్‌ ద్వారా 59 నిమిషాల్లోనే కోటి రుణం మంజూరు చేయనున్నారు. ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి 12 పథకాలను అమలు చేస్తున్నట్లు మోడీ చెప్పారు. వీటి ద్వారా ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఈ దీపావళి మరింత వెలుగునిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మిక నిబంధనల్లో మినహాయింపులు, సులభతర పర్యావరణ అనుమతులు, కంపెనీల చట్టంలో మార్పులు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తున్నవి ఎంఎస్‌ఎంఈలేనని మోడీ చెప్పారు.

కేంద్రం కీలక నిర్ణయం.. 59 నిమిషాల్లోనే కోటి రూపాయల రుణం

కొత్త స్కీం ద్వారా రెండోసారి తీసుకొనే కోటి రుణంపై రెండు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ రంగాన్ని రక్షించేందుకు చిన్న పరిశ్రమల్లో తనిఖీకి కంప్యూటర్‌ ద్వారా సమయం కేటాయిస్తారు. తనిఖీకి వెళ్లిన 48 గంటల్లోపే అధికారులు వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఎంఎస్ఎంఈలకు రుణ పరపతిని పెంచేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ విధానాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది. ఈ రంగానికి చేరువయ్యే ఈ పథకం దేశంలోని 100 జిల్లాల్లో 100 రోజులపాటు అమలు కానుంది.