తొలి టీ20లో భారత్‌ జయకేతనం

టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ ట్వంటీల్లోనూ శుభారంభం చేసింది. ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ-20లో భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో తడబడ్డా విక్టరీ సొంతం చేసుకుంది..

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 6 పరుగులకే కెప్టెన్‌ రోహిత్ శర్మ ఔటయ్యాడు. కాసేపటికే 3 పరుగులు చేసిన ధావన్‌ క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ధనాధన్‌ ప్లేయర్‌ పంత్ ఒక్క పరుగుకే పెవిలియన్‌ బాట పట్టాడు. లోకేష్‌ రాహుల్‌ సైతం 16 పరుగలుకే క్రీజ్‌ వీడాడు. దీంతో భారత్‌ అభిమానులు టెన్షన్‌ పడ్డారు. ఈ దశలో దినేశ్ కార్తీక్, మనీశ్ పాండేల జోడీ జట్టుకు అండగా నిలిచింది.

ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కి 38 పరుగులు జోడించారు. 19 రన్స్‌ చేసిన పాండే ఔటైన తరువాత కృనాల్ పాండ్యా చెలరేగాడు. దినేస్‌ కార్తీక్‌ అజేయంగా 31, కృనాల్‌ 21 పరుగులతో క్రీజ్‌లో నిలిచి భారత్‌ను గెలిపించారు.. దీంతో మూడు టీ-20ల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.