రాచరికపు హోదా వద్దు.. ప్రియుడే ముద్దు

నీ అందం కంటే నీ వెనకున్న ఆస్తులు, అంతస్థులు మరింత అందంగా కనిపిస్తున్నాయంటూ వెంట పడేవారినే ఎక్కువగా చూస్తుంటాము. ప్రేమించిన ప్రియురాలు పెళ్లి చేసుకుందామనే టైమ్‌కి ఆస్తి, అందస్తు గుర్తుకు వస్తుంది. మరి ఇక్కడ జపాన్ రాజకుమారి అయి ఉండి వారసత్వంగా వచ్చిన రాజరికపు హోదాని, ఆస్తి, అంతస్తులను కాదనుకుని ప్రేమించిన ప్రియుడితో జీవితాన్ని పంచుకుంది.

ఓ సామాన్యుడిని పెళ్లాడి తన నిజమైన ప్రేమను చాటుకుంది. తన ప్రేమలోని గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసింది. జపాన్ రాజకుటుంబం గత మూడు తరాలుగా కుటుంబ సభ్యులు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే స్వేచ్ఛను కల్పించింది. అయితే సామాన్యుడిని వివాహం చేసుకున్న మరుక్షణం రాజరికపు హోదాని కోల్పోతారు.

అన్నీ తెలిసే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికే మొగ్గు చూపుతారు రాచరికపు వారసులు. తాజాగా రాకుమారి అయాకో షిప్పింగ్ కంపెనీ నిప్పాన్ యుసెస్‌లో ఉద్యోగం చేస్తున్న32 ఏళ్ల మోరియాను వివాహ మాడింది. చక్రవర్తి అకిహిటో కజిన్ ప్రిన్స్ టకమడో మూడో కుమార్తె అయిన అయాకో వివాహం సోమవారం నాడు టోక్యోలో సంప్రదాయ బద్ధంగా జరిగింది.

నిజానికి జపాన్ రాజకుటుంబంలో పురుషుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రస్తుతం వారసులుగా నలుగురు పురుషులు మాత్రమే ఉన్నారు. రాజకుటుంబ సంతతి రోజు రోజుకి తగ్గిపోతుండడంతో రాజవంశ చట్టాలను మార్చాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తోంది. కొంతమంది సంప్రదాయవాదులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read also:అంబానీ కూతురు ఈషా ‘వెడ్డింగ్ కార్డ్’ అదరహో.. ఒక్కో కార్డ్ ఖరీదు..

ప్రస్తుత నిబంధనల ప్రకారం రాజవంశానికి చెందిన పురుషుడు సామాన్య మహిళను పెళ్లాడితే రాజరికపు హోదాని కోల్పోడు. కానీ మహిళలు మాత్రం రాకుమారి హోదాని కోల్పోతారు. స్త్రీ, పురుష వివక్ష అక్కడ కూడా ఉంది.