ఆకాశాన్ని తాకిన తారాజువ్వ.. అంతలోనే..

పిల్లలకు ఇష్టమైన పండుగ అంటే దీపావళి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, సీమ టపాకాయలు, తారా జువ్వలు, లక్ష్మీ బాంబులు ఇలా చాలానే ఉంటాయి. వెలిగిస్తే వెలుగులు చిమ్మే దీపావళి టపాసులు, పిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకునే పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. టపాసుల రూపంలో డబ్బులు కాల్చేస్తున్నామని తెలిసినా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగని సరదాగా కానిచ్చేద్దామనుకుంటారు.

ఇంట్లో ఇద్దరు చిన్నారులుంటే నాన్నతో గొడవపడి నాలుగు టపాసులు ఎక్కువ కొనిపించుకుంటారు. పక్కింటి చిన్నూగాడి చిచ్చుబుడ్డి కంటే నాదే పైదాకా వెళ్లిందని సంబరపడుతుంటారు ప్రతి ఇంట్లో చిన్నారులు. పెద్దలు కూడా వీధుల్లోకి వచ్చి బాంబులు పేలుస్తూ ఆనందిస్తుంటారు. ఇదివరకటి రోజుల్లో కనీసం మూడు రోజులు జరుపుకునే దీపావళి కాస్తా ఇప్పుడు ఒక్కరోజుకే పరిమితమైంది.

తాజా రూల్ ప్రకారం రెండు గంటలు మాత్రమే టపాకాయలు పేల్చమంటూ ఆదేశాలు వచ్చాయి. మరి ఈ ఉన్న తక్కువ టైమ్‌లో అందనంత ఎత్తుకి ఆకాశాన్ని తాకే టపాసులు తయారు చేయాలంటే మెదడుకి పని చెప్పాల్సిందే అనుకున్నారు బాణా సంచా తయారు చేసేవారు. ఈ టపాసుల్లో ఇంద్రధనసులోని రంగులు లేకపోయినా కన్నార్పకుండా చూసేలా ఉంది. మేఘాల్ని ముద్దాడి తిరిగి వచ్చిన మతాబు ఆకుపచ్చని రంగులో విచ్చుకున్న పారాచూట్‌లాగా చూపరులను ఆకట్టుకుంటోంది. తయారీ దారుని అద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది ఈ తారాజువ్వ.