ఇంజనీరింగ్ పట్టా చేతికి రావాలంటే ‘గేట్’ దాటాలి: కొత్త రూల్!!

ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ ఇలా కొన్ని పరీక్షలను దాటుకుని ఎట్టకేలకు ఉద్యోగులుగా సాప్ట్‌వేర్ కంపెనీల్లో జాయిన్ అవుతున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు. జాయిన్ అయిన తరువాత కానీ ఆ వ్యక్తి గురించిన అసలు విషయం బయటపడట్లేదు. అత్తెసరు మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేయడమో లేక మంచి స్కోర్ సాధించినా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో పాటు విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవడాన్ని గుర్తిస్తున్నాయి సంస్థలు.

అందుకే అలాంటి వారిపై వేటు వేయడానికి వెనుకాడ్డం లేదు. వీటన్నింటికి ముందే అడ్డుకట్ట వేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది ఏఐసీటీఈ. ఇకపై ఇంజనీరింగ్ పట్టా పొందే విద్యార్థులందరూ ముందుగా ‘గేట్’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటున్నారు. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపట్టాలనుకుంటుంది. ఈ నిర్ణయాన్ని ఇంజనీరింగ్ పూర్తిచేసిన 2019-20 విద్యా సంవత్సరం నుంచే తప్పనిసరి చేయనుంది.

ఇక నుంచి ఇంజనీరింగ్ పట్టా చేతికి రావాలంటే ‘గేట్’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఏటా 7 లక్షలమంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందినా తగిన నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ‘గేట్’ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో నిర్వహించిన ఏఐసీటీఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా విడుదల కాలేదు. ‘గేట్’ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహించాలా లేక ఆయా రాష్ట్రాల్లోని టెక్నికల్ యూనివర్శిటీలు నిర్వహిస్తాయా అన్నదానిపట్ల స్పష్టత లేదు.

ఇకపై ‘గేట్‌’లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఇంజనీరింగ్ పట్టా అందజేస్తామని ఏఐసీటీఈ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. ఏఐసీటీఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదించేవారు కొందరైతే వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతను మెరుగుపరిచేదిగా ఉందని కొందరంటే, దీనివల్ల ప్రయోజనం శూన్యమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

‘గేట్’ ఉత్తీర్ణతని కంపల్సరీ చేసే బదులు ఇంజనీరింగ్ కాలేజీలే సొంతంగా ఆప్టిట్యూడ్, టెక్నాలజీ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి పరీక్షలను ప్రతి సెమిస్టర్‌లో నిర్వహిస్తే మంచిదని న్యూహోరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ మంజునాథ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.