పెరిగిన ఎస్‌జీటీ పోస్టులు.. డీఎస్సీలో మరికొంత మందికి అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018- డీఎస్సీ నోటిఫికేషన్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ నోటిఫికేషన్‌లో మొత్తం పోస్టుల సంఖ్య 7,729 కాగా, వాటికి మరో 178 పోస్టులు కలవనున్నాయి. ఇవన్నీ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉర్దూ మీడియం పోస్టులు.

అయితే ఇదే ఏడాది ఆగస్టులో 211 ఉర్దూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా అభ్యర్థులు లేని కారణంగా కేవలం 24పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 9 పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. మిగిలని 178 పోస్టులను భర్తీ చేయదలచి, ఆ పోస్టులను కూడా ఓసీ పోస్టులుగా మార్చి భర్తీ చేయనున్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం 3,666 ఎస్‌జీటీ పోస్టులతో పాటు ఈ 178 పోస్టులు కూడా కలిశాయి.

ఇదిలా ఉండగా లాంగ్వేజెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు గత నెల 26న విడుదల చేసిన జీ.వో 67కి పలు సవరణలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు (జీ.వో 70) జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ మరియు లాంగ్వేజ్ పండిట్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. డిగ్రీలో ఆప్షనల్‌గా తీసుకున్న లేదా ఆయా లాంగ్వేజ్‌లో పీజీ చేసినా అర్హులుగా నిర్ణయించారు.