దీపావళి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవే..!

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి… సీతమ్మను తీసుకుని అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం వచ్చిందని కూడా చెప్తుంటారు. మొత్తానికి చెడును రూపుమాపి.. మంచిని మిగిల్చిన సందర్భంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి… విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది.

దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెంది వుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.

దీపావళి వస్తోందంటే.. ఊళ్లలో సందడే సందడి. టపాసుల మోతలు ఊరంతా వినబడితేనే పండుగకు నిండుదనం వచ్చినట్టుగా అంతా భావిస్తారు. డబ్బున్నా లేకపోయినా.. అప్పు చేసైనా సరే.. పిల్లల ముచ్చట తీరుస్తారు. చిన్న చిన్న టపాసులను కొంతమంది సొంతంగానే తయారు చేసుకునేవారు. దీపావళి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టపాసుల వ్యాపారం ఏటా వందల కోట్లలో జరుగుతుంది. కానీ, ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. అసలే రేట్లు భయపెడుతున్నాయంటే.. మరోవైపు సుప్రీంకోర్ట్ తీర్పు జనాన్ని నిరుత్సాహపర్చింది.

ఇక… పర్యావరణ హిత దీపావళి జరుపుకుందామన్న మాట కూడా ఉద్యమంలా వ్యాపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశమంతా ఇదే బాట పడుతోంది. కాలుష్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అంతా దివ్వెల దీపావళినే జరుపుకుందామని పిలుపునిస్తున్నారు.

మరోవైపు ఏటా గ్రీన్‌ క్రాకర్స్ వినియోగం సైతం పెరుగుతోంది. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం తక్కువగా వెదజల్లే టపాసులనే గ్రీన్‌క్రాకర్స్‌ అంటారు. సాధారణ క్రాకర్స్‌తో పోల్చితే ఇవి 30 శాతం తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయి. టపాసులు కాల్చినపుడు వెలువడే నైట్రస్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌ వంటి వాయువులు గ్రీన్‌కాకర్స్‌ కాల్చినపుడు 30 నుంచి 35 శాతం తక్కువ వెలువడుతాయి.

మొత్తానికి పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనే పండగే దీపావళి. అయితే ఈ పండుగ మధురానుభూతిని అందించాలంటే.. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.