దివాళీ ధమాకాతో అదరగొట్టిన టీమిండియా

లక్నోలో టీమిండియా ఒకరోజు ముందే దివాళీ ధమాకాతో అదరగొట్టింది. రెండో టీ ట్వంటీలో విండీస్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. రోహిత్‌శర్మ సెంచరీతో చెలరేగిపోతే…. బౌలర్లు సమిష్టిగా రాణించి మరో సిరీస్‌ను అందించారు.

సొంతగడ్డపై భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. షార్ట్ ఫార్మేట్‌లో పోటీ ఇస్తుందనుకున్న వెస్టిండీస్ చేతులెత్తేయడంతో సునాయాసంగానే టీ ట్వంటీ సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో కాస్త పోరాడిన కరేబియన్ టీమ్ లక్నోలో మాత్రం నిరాశపరిచింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచింది. తొలి మూడు ఓవర్లలో కేవలం 11 పరుగులే చేసిన భారత్‌… 195 పరుగులు చేసిందంటే రోహిత్‌శర్మ ఏ విధంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు., విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్‌ తన కెరీర్‌లో నాలుగో టీ ట్వంటీ శతకాన్ని అందుకున్నాడు. 58 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. ఈ భారత ఓపెనర్‌ అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

భారత్ భారీ స్కోరును విండీస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే తడబడిన ఆ జట్టు బ్యాట్స్‌మెన్ త్వరగానే చేతులెత్తేశారు. పేసర్లతో పాటు స్పిన్నర్లూ సమిష్టిగా రాణించడంతో 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ కనీసం రోహిత్ స్కోర్ 111 పరుగులైనా సాధిస్తుందా అనిపించింది. అయితే బ్రేవో , కీమో పాల్ పోరాడడంతో వెస్టిండీస్ 124 పరుగులు చేయగలిగింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.