వివాదంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ

virat-kohli

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌ను విడిచి వెళ్ళంటూ అభిమానిని ఉధ్ధేశించి కోహ్లీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అటు అభిమానులతో పాటు ఇటు సెలబ్రిటీలు కోహ్లీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటకీ తాను ఆ కామెంట్స్‌కి కట్టుబడి ఉన్నానంటూ భారత కెప్టెన్ ట్వీట్‌ చేయడంతో వివాదం మరింత ముదిరింది.

Also read : మరో 15రోజుల్లో టీడీపీలోని ఈ నేతలపై ఐటీ, ఈడీ దాడులు..!

మైదానంలో భారత కెప్టెన్ విరాట్‌కోహ్లీ దూకుడు గురించి చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి బౌలర్లపై తనదైన షాట్లతో విరుచుకుపడే కోహ్లీ… మాటల యుధ్ధంలోనూ స్పీడే. ఒక్కోసారి ఈ దూకుడు ఆటపరంగా మేలే చేసినా… కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతోంది. అయితే తాజాగా ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ తన దూకుడు కోహ్లీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా ట్విట్టర్‌లో భారత కెప్టెన్ చేసిన ఒక ట్వీట్‌ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తన బర్త్‌డే రోజున వచ్చిన ట్వీట్లను చదువుతూ విరాట్ ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్‌లో తనకు కొత్తదనం ఏమీ కనిపించదని, అతని కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లే బాగా ఆడతారంటూ ఒక అభిమాని చేసిన ట్వీట్ భారత కెప్టెన్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనిపై ఘూటుగా స్పందించిన కోహ్లీ… నువ్వు నన్ను అభిమానించకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు.. అయితే ఇక్కడ ఉంటూ వేరే దేశాలపై ఎక్కువ అభిమానం చూపుతున్నావంటూ… దేశం విడిచి వెళ్ళమంటూ సూచించాడు. అయితే కోహ్లీ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

భారత కెప్టెన్‌ ఇలా స్పందిస్తాడని అనుకోలేదని విమర్శలు గుప్పించారు. దేశం విడిచి వెళ్ళమని చెప్పేందుకు కోహ్లీ ఎవరంటూ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేశారు. భారత్‌దేశంలో ఉన్నా… ఇతర దేశాలను ద్వేషించమని ఎవ్వరూ చెప్పలేదంటూ ఘూటుగా స్పందించారు. ఈ వివాదంపై హీరో సిధ్ధార్థ్ కూడా కోహ్లీ తీరును తప్పుపట్టాడు. కోహ్లీ లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి చెత్త మాటలు ఎలా వచ్చాయని విమర్శించాడు. కింగ్‌ కోహ్లీగా కొనసాగాలంటే ద్రవిడ్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించాడు. కాగా తనపై వెల్లువెత్తిన విమర్శలకు కోహ్లీ కూల్‌గా రిప్లై ఇచ్చాడు. తనకు ఇలాంటివి కొత్త కాదన్న భారత కెప్టెన్‌…ఈ కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానంటూ సమర్థించుకున్నాడు. కాగా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన విరాట్‌ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం అటు విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఆఫ్ ది ఫీల్డ్‌లో హుందాగా వ్యవహరించుకోవడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. విమర్శలపై బాధ్యతాయుతంగా స్పందించాలని , మాటలు జారకూడదన్నది విరాట్‌ నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరున్న సచిన్ , ద్రవిడ్‌ వంటి బ్యాట్స్‌మెన్‌ హుందాగా ఉంటూ ఆటకే వన్నె తెచ్చిన విషయం కోహ్లీ గుర్తుంచుకుంటే మంచిది. లేకుంటే ఎంత గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా… ఇలాంటి వివాదాలు కెరీర్‌లో మచ్చలుగా మిగిలిపోతాయి.