కార్తీక మాసంలో శివార్చన.. ముఖ్యంగా మరో మూడు..

మాసాలన్నీ మంచివే. ప్రత్యేకంగా చెప్పుకునేవి మాత్రం రెండు మాసాలు.. అందులో ఒకటి శ్రావణం అయితే మరొకటి కార్తీకం. దీపావళి పండుగ తరువాతి రోజు నుంచి వచ్చే కార్తీకమాసం ప్రతి రోజు పండుగ రోజుని తలపిస్తుంది. ఇందులో ముఖ్యంగా సోమవారం పరమ శివునికి ప్రీతి పాత్రమైన రోజు.

స్కంద పురాణంలో కార్తీక మాసం గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ” సకార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరమ్..నబవేద సమం శాస్త్రం.. నతీర్థం గంగయాస్సమమ్..” అని పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన నెల, ఆది కేశవునికి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదు అని ఈ శ్లోకం అర్థం.

సూర్యోదయానికి ముందే ముగించే స్నానాలు, వెలుగులు పంచే దీపారాధనలు, మంచి మనసుతోచేసే దానాలు.. ఈ మూడింటికి ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్రమాసంగా కార్తీక మాసాన్ని చెబుతారు పండితులు. ఈ నెలలో పవిత్ర మనసుతో ఏ సత్కార్యం చేసినా అది భగవంతునికి చేరుతుంది. శారీరక మానసిక రుగ్మతలను పారద్రోలి ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఉషోదయ స్నానం.

శివాలయంలో పరమ శివుడిని అర్చిస్తూ చేసే భగవద్ధ్యానం, స్తోత్రం, జపం మానసిక ప్రశాంతతను ఇస్తాయి. శివ కేశవులకు ఇష్టమైన ఈ మాసంలో స్త్రీలు పెరట్లోని తులసి మొక్క ముందు దీపారాధన చేసి భక్తితో ప్రణమిల్లుతారు. అభిషేక ప్రియుడైన శివునికి ఈ మాసంలో ప్రతి రోజూ అభిషేకాలు జరుగుతాయి. ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివార్చన ఈతిబాధలను, గ్రహదోషాలను పోగొడుతుంది.

కార్తీక ఏకాదశి నుండి పౌర్ణిమ రోజు వరకు ఐదు రోజులు దీక్షగా శివ విష్ణు ఆరాధన చేయడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. దీన్ని భీష్మ పంచకవ్రతం అని అంటారు. శివాలయంలో దీపాన్ని దానం చేయడం ద్వారా ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు తులసీ వివాహం, వైకుంఠ చతుర్దశినాడు ఉసిరి చెట్టుకింద దీపారాధన చేయడం ద్వారా శివసన్నిధానాన్ని చేరుకోవచ్చు. ఇక పౌర్ణమి రోజు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు కొందరు భక్తులు. భోజనానికి బదులు పండ్లు తీసుకోవడం ద్వారా ఊబకాయం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయంటారు.

ఆలయాల్లో ఇచ్చే తీర్ధం పచ్చకర్పూరం, స్పటిక, తులసి, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో కలిపి చేస్తారు. ఈ తీర్థాన్ని పుచ్చుకోవడం ద్వారా శరీరంలోని వేడి తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని సమారాధన చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ కార్తీక మాసం ప్రతి రోజు పవిత్రమైనది.