భార్య భారీగా.. నాకొద్దు బాబోయ్ అంటూ..

చిన్నప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటే సో.. క్యూట్ అంటారు. మరి కాస్త వయసొచ్చాక అదే కంటిన్యూ అయితే తిండి మానేసి స్లిమ్‌గా అవడానికి నానా తిప్పలు పడుతుంటారు. కొంత మంది వంశపారంపర్యంగా వస్తున్న జీన్స్ కారణంగానో, కొన్ని అనారోగ్య కారణాల మూలంగానో బొద్దుగా ఉంటారు. పెళ్లయిన తరువాత ఇలాంటి వారికి అసలు కష్టాలు మొదలవుతాయి.

పూణేకి చెందిన ఓ వ్యక్తి భార్య లావుగా ఉందని, ఆమెతో తాను కాపురం చేయలేనని విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కాడు. ఆమె విడాకుల నోటీసు మీద సంతకాలు పెట్టనంటే పెడతావా లేదా అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. 2006లో వీరికి వివాహం అయింది. కొంతకాలం కాపురం బాగానే సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

పెళ్లికి ముందునుంచే కొంచెం బొద్దుగా ఉన్న ఆమె పిల్లలు పుట్టిన తరువాత మరింత బొద్దుగా మారింది. దాన్ని కారణంగా తీసుకుని రోజూ భర్త వేధింపులకు గురిచేసేవాడు. భోజనం కూడా సరిగా చేయనిచ్చేవాడు కాదు. అదేమని భార్య ఎదురుతిరిగితే కొట్టేవాడు. ఇంటికి వచ్చిన అత్తమామల్ని కూడా దూషించేవాడు. అవన్నీ భరిస్తూనే కాపురం చేస్తోంది భార్య.

పెరిగిన బరువుని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది. అయినా సంతోషించని భర్త ఆమెనుంచి విడిపోవాలని విడాకులకు అప్లై చేశాడు. దీంతో బాధితురాలు భర్త పెట్టే టార్చర్ భరించలేక పోలీసుల్ని ఆశ్రయించింది. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.