చంద్రబాబు ఎంట్రీతో ఢిల్లీ రాజకీయాల్లో 1996 పరిణామాలు: కుమారస్వామి

దేశాన్ని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమార స్వామితో భేటీ అయిన చంద్రబాబు.. సమకాలీన పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. దేవెగౌడతో తనకు ముందునుంచీ మంచి సంబంధాలు ఉన్నాయని.. తన పోరాటానికి మద్ధతు పలకాలని కోరినట్లు తెలిపారు. దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయని.. ఈడీ, ఐటీ లాంటి విభాగాలను కేంద్రం సొంత ఎజెండాకు వాడుకుంటోందని ఆరోపించారు.

దేశ ప్రయోజనాల కోసమే సెక్యూలర్ భావజాలం కలిగిన పార్టీలన్ని ఏకం అవుతున్నాయని అన్నారు చంద్రబాబు నాయుడు. తమ కూటమి పదవుల కోసం కాదని..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని అన్నారాయన. తమ కూటమిలో ప్రధాని అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడే చర్చించుకోవటం తొందరపాటేనని అన్నారాయన.

సెక్యులర్ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి చంద్రబాబు కష్టపడుతున్నారని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. బీజేపీయేతర పక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలన్ని నాశనం అయ్యాయని విమర్శించారు దేవేగౌడ.

బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సెక్యూలర్ శక్తులన్నింటిని ఏకంగా చేసేలా తమ మధ్య చర్చలు జరిగాయని అన్నారు కర్నాటక సీఎం కుమారస్వామి. ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబు ఎంట్రీ ఇవ్వటంతో ఢిల్లీ రాజకీయాల్లో మళ్లీ 1996 పరిణామాలే రాబోయే ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.