ఆవేశంతో ఒక్క రాత్రిలో 600 కోళ్లను..

ఆవేశంలో విచక్షణను కోల్పోతుంటారు. ఏం చేస్తుంటారో అర్థం కాదు. ఆవేశం చల్లారక ఆలోచించి తల పట్టుకుంటారు. నేనిలా ఎందుకు చేశాను అని. కానీ ఇక్కడ ఆవేశపడింది మనిషి కాదు శునకం. అది బాధపడిందో లేదో కాని దాని యజమానికి మాత్రం నష్టపరిహారంగా లక్షన్నర ఫైన్ పడింది.

చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌ నిన్గువోకు చెందిన ఓ వ్యక్తి హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. పడుకునే ముందు శునకాన్ని బోనులో ఉంచుతాడు. ఓ రోజు రాత్రి శునకం బోనులో నుంచి బయటకు తప్పించుకుని పారిపోయి దగ్గరలోని కోళ్ల ఫారమ్‌లోకి వెళ్లింది. అక్కడ ఉన్న వందల కోళ్లను చూసింది. దానికి కాపలా దారులు ఎవరూ లేకపోవడంతో శునకాన్ని వారించే వారు ఎవరూ లేరు.

దీంతో అది కోళ్ల ఫారమ్‌లోకి జొరబడి పిచ్చి పట్టినట్టుగా వ్యవహరించింది. 600 కోళ్లను కొరికి చంపేసింది. ఉదయం యజమాని వచ్చి చూసుకునేసరికి కోళ్లన్నీ చనిపోయి ఉన్నాయి. ఇదంతా ఎవరు చేసి ఉంటారా అని చుట్టూ పరికించి చూశాడు. ఇంతలో ఓ మూల నోటిలో కోడిని కరుచుకుని ఉన్న కుక్క కనిపించింది.

దాన్ని కట్టేసి ఎవరిదై ఉంటుందని యజమాని కోసం ఆరా తీసాడు. అతని ఇంటికి వెళ్లిన కోళ్ల ఫారం యజమాని అదే ఆధారంగా బతుకుతున్నాను. వాటన్నింటిని మీ కుక్క చంపేసిందని, ఇందుకు బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించమని కోరాడు. ముందు ఇవ్వను పొమ్మన్నాడు శునకం యజమాని. కానీ పోలీసులు ఎంటరవడంతో అడిగినంత ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది.

కుక్క ఒక్క రాత్రిలో 600 కోళ్లను ఎలా చంపిందనేది మాత్రం స్థానికులను వేధిస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే హస్కీ జాతికి చెందిన కుక్కలు వేటాడడంలో నైపుణ్యం కలిగి ఉంటాయని, కొంత ఆవేశం కూడా వాటికి ఎక్కువని, అందుకే ఇన్ని కోళ్లను ఒక్కసారే చంపగలిగిందని జంతు సంరక్షణాధికారులు వివరించారు.