సిటీ బస్సులో ఖాకీ బాస్ చేసిన ఘనకార్యం..

bus strike

టిక్కెట్టు తీసుకోకుండా బస్సులో ప్రయాణించడం నేరం. సామన్య ప్రయాణీకులు ఇలా చేస్తే జరిమానా విధిస్తారు. మరి ట్రాఫిక్ పోలీసులు టిక్కెట్లు లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తే.. జరిమానా విధించేది ఎవరు.. జరిమానా సంగతి తర్వాత.. అసలు ఖాకీలను టిక్కెట్టు తీసుకోమని అడిగే కండక్టర్లు ఉన్నారా.. అన్నది పాసింజర్లకు ఓ పెద్ద డౌట్. పోనీ ఒకవేళ సిన్సియర్‌గా డ్యూటీ చేసే కండక్టర్లు వారిని టిక్కెట్టు తీసుకోమంటే.. పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ ఖాకీలకు కోపం కట్టలు తెంచుకుంటుంది. మమ్మల్నే టిక్కెట్టు అడుగుతావా అంటూ వారి మీద తమ జులూం చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని సిటీ బస్సులో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శన.

లక్డీకాపూల్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఖాకీ జులూం చూపించాడు. ఆర్టీసీ బస్సు ఎక్కిన ట్రాఫిక్ కానిస్టేబుల్ టికెట్ తీసుకునేందుకు నిరాకరించాడు. టిక్కెట్ తీసుకోకుంటే బస్సు దిగాలని కోరిన కండక్టర్‌ని అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్టు దూషించాడు. పోలీస్ స్టేషన్‌లో పడేసి చితగొడ్తానంటూ అతడిని బెదిరింపులకు గురి చేశాడు.

ఇదంతా గమనించిన తోటి ప్రయాణికులు ట్రాఫిక్ పోలీస్ తీరును తప్పుబట్టి నిలదీశారు. టిక్కెట్ తీసుకోకపోవడమే కాక కండక్టర్‌ పై మాటల దాడికి దిగడంపై కడిగిపరేశారు. దీంతో అసెంబ్లీ బస్టాప్ దగ్గర ఆ కానిస్టేబుల్ దిగకతప్పలేదు. ఇదంతా ఓ ప్రయాణీకుడు వీడియో తీయడంతో అది కాస్తా వైరల్‌ అయింది.