ట్రంప్‌ టెంపర్‌కి బ్రేక్‌లు..!

donald-trump-us-arms-agreement-russia

మధ్యంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడికి షాక్‌ తగిలింది. ప్రతినిధుల సభలో డెమొక్రటిక్‌ పార్టీకి మెజార్టీ రావడంతో.. ట్రంప్‌ టెంపర్‌కి బ్రేక్‌లు పడ్డాయి. రెఫరెండమ్‌ లాంటి ఎన్నికల్లో భారీ దెబ్బ పడటంతో కష్టాలు ఖాయమంటున్నారు విశ్లేషకులు. రెండేళ్ల నుంచి ఆడింది ఆటగా దూసుకుపోతున్న ట్రంప్‌కు.. ఇక మూడినట్లే అని హెచ్చరిస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అమెరికన్లు షాక్‌ ఇచ్చేట్టు కనిపిస్తున్నారు. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల సభలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. ప్రతినిధుల సభలోని 435 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 412 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 219 స్థానాల్లో డెమొక్రట్లు గెలుపొందగా… 193 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 26 స్థానాలను కూడా డెమొక్రట్లు కైవసం చేసుకోవడంతో హౌస్‌లో మెజార్టీ సాధించారు.

ఇక.. సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సెనేట్‌లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్‌ జరగగా.. 31 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. సెనేట్‌కు 51 మంది రిపబ్లికన్లు, 45మంది డెమొక్రట్లు ఎన్నికయ్యారు. ఇందులో డెమొక్రట్లు రెండు సీట్లను కోల్పోయారు. ఇక… 36 రాష్ట్రాల గవర్నర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించగా.. 33 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తాజా ఫలితాలతో డెమొక్రటిక్‌ గవర్నర్లు గతం కంటే ఏడుగురు పెరిగారు.

మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమొక్రట్లు అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని ట్రంప్ ముందరి కాళ్లకు బంధమేశారు. ట్రంప్‌ సర్కార్‌ ప్రవేశపెట్టే చట్టాలను డెమొక్రట్లు అడ్డుకోవడంతో పాటు.. అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలున్నాయి. పారదర్శకత లేని ఆర్థిక వ్యవహారాలతో పాటు 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపైనా దర్యాప్తు కోరే ఛాన్స్‌ ఉంటుంది. అవసరమైతే ట్రంప్‌పై అభిశంసన కూడా ప్రవేశపెట్టే అవకాశముంది.

మొత్తానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత ట్రంప్‌కు ఇది భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇరు సభల్లోనూ రిపబ్లికన్లే మెజారిటీ సాధించడంతో.. ఇప్పటిదాకా ట్రంప్ పాలన సాఫీగా సాగింది. తాజా ఎన్నికల ఫలితాలు అక్కడి అధికారాన్ని తలకిందులు చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.