కోహ్లీ.. ఏమైంది నీకు.. ఎందుకలా.. : నెటిజన్స్ క్లాస్

సామాన్యులు ఏం మాట్లాడినా పట్టించుకునే వాళ్లు ఉండరు. కానీ సెలబ్రెటీలు ఏం మాట్లాడినా కాస్త ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలాగా వివాదాల్లో చిక్కుకోవలసి వస్తుంది. కోహ్లీ సూపర్ అంటూ పొగిడిన నోరే.. ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ క్లాసు పీకుతున్నారు. మరి వారిని అంతలా బాధించిన విషయం ఏమైఉంటుందని ఆరా తీస్తే..

ఇండియన్ క్రికెటర్ల తీరు గురించి ఓ క్రికెట్ అభిమాని ఊసుపోక కామెంట్ చేశాడు. నవంబర్ 5న తన 30 వ పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ తన పేరుతో ఓ యాప్‌ని ప్రారంభించాడు. దీని ప్రమోషన్‌లో భాగంగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ భారత క్రికెటర్ల కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లనే ఎక్కువ ఇష్టపడతానని అన్నాడు.

అంతటితో ఊరుకోకుండా కోహ్లీ పెద్ద ఆటగాడేం కాదు. అతడి ఆటలో అంత ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇలాంటి వారి ఆట కంటే ఇతర దేశస్తుల ఆట తీరే ఎంతో మెరుగ్గా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు.

అతడి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కోహ్లీకి చిర్రెత్తుకొచ్చింది. అయితే నువ్వు భారత్‌లో ఉండడం ఎందుకు.. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపో.. భారత గడ్డపై ఉంటూ పరాయి దేశాలని పొగుడుతావా అంటూ సదరు వ్యక్తిపై ధ్వజమెత్తాడు. మైదానంలో క్రికెట్ ఆడేటప్పుడు మీరు చేసే అల్లరి, ఉత్సాహపూరితమైన మాటలే మమ్మల్ని మరింత పట్టుదలగా ఆడాలనిపిస్తాయి.

అలాంటిది మమ్మల్ని కాదని మరొకరిని పొగుడుతావా అంటూ విమర్శల వర్షం కురిపించాడు. ఇది సరైన పద్దతి కాదంటూ విరుచుకుపడ్డాడు. తనను, తన ఆటని ఇష్టపడనందుకు చేసిన వ్యాఖ్యలు కాదని దేశంపై ప్రేమ, మన దేశ ఆటగాళ్లపై ఉన్న అభిమానం మాత్రమే అని కోహ్లీ తన బాధను వ్యక్తం చేశాడు.

కోహ్లీ బాధను మరో విధంగా అర్థం చేసుకున్నారు నెటిజన్స్. అతడు చేసిన కామెంట్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. స్వదేశంలో కాకుండా విదేశంలో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులు కొనమంటూ పలు ప్రకటనల్లో పాల్గొంటూ.. నువ్వా దేశం గురించి మాట్లాడేది.. ఆ అర్హతని కోల్పోయావంటూ కోహ్లీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హ్యాట్రిక్ సాధించిన కోహ్లీ.. ఇటీవలే వన్డేల్లో 10 వేల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. వన్డేల్లో పలు రికార్డులు సాధించినా అవేవి తనకు సంతోషాన్ని ఇవ్వవని, అంతిమంగా దేశం కోసం ఆడడమే తనకు అత్యంత ఆనందాన్నిచ్చే అంశమని కోహ్లీ పలు సందర్భాల్లో చెబుతుంటాడు.