నువ్వో మూర్ఖుడివి.. ప్రశ్నించిన జర్నలిస్టుపై నిషేధం విధించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరోసారి కోపం వచ్చింది. మద్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎన్‌ఎన్ జర్నలిస్టు జిమ్ అకోస్టాపై ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించాడు. అమెరికా వలస విధానం, రష్యాకు సంబంధించిన ప్రశ్నలను జిమ్ అకోస్టా అడిగాడు. లాటిన్ అమెరికా నుంచి వస్తున్న వలసలను దండయాత్రగా వర్ణించడంపై జిమ్.. ట్రంప్‌ను ప్రశ్నించారు. చట్టబద్ధంగా వస్తే బాగుంటుందని.. కానీ చట్టవిరుద్ధంగా వస్తే ఎలా అని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి రష్యాకు సంబంధించి ప్రశ్నను అడగగా..”నువ్వో మూర్ఖుడివి..నీకు అసలు మనుషులను గౌరవించే విధానం తెలుసా.. నువ్వో భయంకరమైన వ్యక్తివి’’ అంటూ తీవ్రపదజాలంతో  జిమ్‌ను  ట్రంప్ దూషించారు. అకోస్టా నుంచి మైక్ తీసుకోండంటూ సిబ్బందిని ఆదేశించారు. జిమ్ ప్రెస్ పాస్‌ను రద్దు చేయాల్సిందిగా వైట్‌హౌస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.