10 నిమిషాల్లో 50 వార్తలు..

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమార స్వామితో ఆయన భేటీ అయ్యారు. సెక్యులర్ పార్టీల ఏకీకరణ,.భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు.
……………….
చంద్రబాబు ఇవాళ చెన్నై వెళ్తున్నారు. సాయంత్రం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో సమావేశమై, మోడీ విధానాలు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.
……………….
మహాకూటమి సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3 చొప్పున సీట్లు కేటాయించినట్టు కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. అయితే ఒక్క సీటు తెలంగాణ ఇంటి పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన 93 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే పోటీ చేయనున్నారు.
……………….
కాంగ్రెస్ ప్రస్తుతానికి 74 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నెల 10న తొలి జాబితాను విడుదల చేయనున్నారు. మిగిలిన 19 సీట్లపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి, 11, 12 తేదీల్లో వెల్లడిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు..
……………….
పేద బ్రాహ్మణులందరికీ టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. దేశం మొత్తంలో ట్రెజరీ నుంచి.. పురోహితులకు జీతాలు ఇస్తోంది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని హైదరాబాద్‌లో బ్రాహ్మణ సంఘాలతో జరిగిన సమావేశంలో చెప్పారు.
……………….
సిద్దిపేట ప్రజలు, కేసీఆర్‌ ఆశీస్సులతో 5 సార్లు గెలిచానని మంత్రి హరీష్‌ కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేటలో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మన దగ్గరే ఉండాలన్నారు.
……………….
సూర్యాపేట నియోజకవర్గాన్ని 4 వేల కోట్లతో అభివృద్ధి చేశానని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేవన్నారు. ప్రజావ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి, నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొల్పానని మంత్రి తెలిపారు
……………….
కేసీఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు.. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తరపున కరీంనగర్ జిల్లా నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆమె.. పార్టీలో కొందరు నేతల తీరుతో మనస్థాపం చెందారు. ఎలాగైనా తనకు టికెట్ వచ్చేలా సహకరించాలని చంద్రబాబును రమ్యారావు కోరినట్టు తెలుస్తోంది.
……………….
మహాకూటమి అభ్యర్థి ఎవరైనా బంపర్ మెజారిటీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ పిలుపిచ్చారు. టీఆరెస్‌ రాచరిక పాలనకు చరమ గీతం పాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
……………….
గజ్వేల్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వెల్లడించారు ప్రజాగాయకుడు గద్దర్‌. ఈ నెల 15 నుంచి తెలంగాణలో పల్లె పల్లెకు వెళ్లి ఓటుపై అవగాహన కల్పిస్తానన్నారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు.
……………….
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో బీజేపీ పన్నా ప్రముఖ్‌ల సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఐదు రాష్ట్రాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. ఐదేళ్లు పాలించడం చేతకాకే… కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు.
……………….
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం లేకపోవడం సిగ్గుచేటని వైరా బీజేపీ అభ్యర్థి రేష్మా రాథోడ్‌ చెప్పారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర పథకాలు అమలు కాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని రేష్మా ఆరోపించారు.
……………….
జగిత్యాల జిల్లా ధర్మపురిలో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కూతురు నందిని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమం కోసం పాటుపడే ఈశ్వర్‌ను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
……………….
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీఆరెస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ ప్రచారం ముమ్మరం చేశారు. టీఆరెస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు.
……………….
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాజేంద్రనగర్‌ లో పోటీ మహా కూటమి, మజ్లిస్ మధ్యే పోటీ ఉంటుందని వారు చెప్పారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో… కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని విమర్శించారు.
……………….
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల విద్యానగర్ కాలనీ లో మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత… గడప గడప టీఆరెస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన కేసీఆర్ ను.. మరోసారి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
……………….
కూకట్‌ పల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మూసాపేట డివిజన్ లో ప్రచారం చేశారు. ఆంజనేయనగర్, జనతానగర్, శ్రీకాకుళం బస్తీలలో తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మళ్లీ గెలిపిస్తే, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాధవరం హామీ ఇస్తున్నారు.
……………….
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం విపక్షాలు మహాకూటమి వేషం కట్టాయని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల నిర్ణయం అమరావతి, ఢిల్లీలో జరగడం సిగ్గు చేటన్నారు.
……………….
జయశంకర్ జిల్లా కాటారం మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రచారం చేశారు. టీఆరెస్ పాలనలో రైతులు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ చేస్తామని, కౌలు రైతును కూడా ఆదుకుంటామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
……………….
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పకుండా పోటీ చేస్తానని ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. రాహుల్‌ గాంధీ, ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై నమ్మకముందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటును పొత్తులో భాగంగా మహాకూటమికి వదులుకునేది లేదన్నారు.
……………….
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. తనిఖీల పేరుతో ఎన్నిక అధికారి సతీష్‌ ఆఫీస్ తాళం పగులగొట్టి సోదాలకు యత్నించారు. అయితే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అతన్ని నిర్భందించారు.
……………….
అశ్వరావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు ప్రచారంలో అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ముల్కాలపల్లి మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా జనం తాటి ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయకుండా కోట్లాది రూపాయలు కూడబెట్టుకున్నాడని ప్రజలు తాటిని నిలదీ
స్తున్నారు.
……………….
హైదరాబాద్‌ మల్కాజిగిరిలో TJS నేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బ్యానర్లు, కుర్చీలు, ధ్వంసం చేశారు.
……………….
విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగల్లులో పశు వైద్య శాలను మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. గోకులం పథకం ద్వారా పశువుల పెంపకానికి సబ్సిడీపై రుణాలు ఇస్తున్నామని తెలిపారు.
……………….
విశాఖ భూస్కాంపై సిట్‌ నివేదికను ఏపీ కేబినెట్‌ ఆమోదించడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ నేతల అండతోనే భూములు కబ్జాకు గురౌతున్నాయని ఆ పార్టీ నేత జేవీ సత్యనారాయణ ఆరోపించారు. సిట్‌ నివేదికలో మంత్రి గంటా తన పేరు లేకుండా చేసుకున్నారని విమర్శించారు.
……………….
బీజేపీ పాలనలో దేశంలోని వ్యవస్థలన్నీ సర్వ నాశనం అయ్యాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో తప్పును సరిదిద్దుకుంటామని రాహుల్ హామీ ఇచ్చినందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
……………….
తెలుగు ప్రజలపై కేంద్రం కక్ష గట్టి చంంద్రబాబు సర్కారును వేధిస్తోందని ఏపీ ఎస్సీ,ఎస్టీ కమీషన చైర్మన్‌ కారం శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన హామీ లను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
……………….
ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో దేశ ప్రజలందరు దీపావళి పండుగను ఆనందోత్సాహలతో జరుపుకున్నారని టీడీపీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. కోడికత్తి డ్రామా ఫెయిల్ కావడంతో జగన్ మాట్లాడటం లేదని విమర్శించారు.
……………….
నోట్ల రద్దు అతి పెద్ద ఫెయిల్యూరని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. ఉత్తర‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి నోట్ల రద్దు ఉపయోగపడిందన్నారు. నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని తెలిపారు.
……………….
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత బాపిరాజు, బీజేపీ నేత మాణిక్యాల రావు బహిరంగ చర్చలకు సవాల్‌ చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. ఇద్దరిని తాడేపల్లిగూడెంలో హౌస్ అరెస్ట్ చేశారు.
……………….
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్నూలు జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరు వీఆర్వో జేజే బాబు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే గాజులపల్లెలో అతని అత్త, హైదరాబాద్‌ లోని అతని అల్లుడి ఇళ్లలోను తనిఖీలు జరిపి 3 నుంచి 4 కోట్ల వరకు అక్రమ ఆస్తులు గుర్తించారు.
……………….
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం లక్ష్మీపురంలో ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 226 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లుపై కేసు నమోదు చేశారు.
……………….
విశాఖ జిల్లా చోడవరంలో మైనర్‌ బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. చోడవరం ప్రభుత్వ కళాశాలలో ఇండర్మీడియట్ సీఈసీ చదువుతున్న పద్మ ను అదే వీధిలో ఉంటున్న మైనర్లే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
……………….
విశాఖ గాజువాక ఆటోనగర్ హుందాయ్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సర్వీసింగ్ కు వచ్చిన మూడు కార్లు దెబ్బతిన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ తో ప్రమాదం జరిగిందని షోరూమ్‌ సిబ్బంది తెలిపారు.
……………….
హైదరాబాద్‌ అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో మెట్ల పైనుంచి దూకి ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన వ్యక్తి ఎవరనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
……………….
విజయనగరం జిల్లా పార్వతీపురం బాపూజీ కాలనీలో గాంధీ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మద్యం మత్తులో ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
……………….
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్ మండలం సింగపూర్ గ్రామంలో‌ దారుణం జరిగింది. అడవి పందుల బారి నుంచి రక్షణ కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు.
……………….
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కమేపల్లిలో ఆలేటి పేతులు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే గురువయ్య అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పేతులు, గురువయ్య ఇద్దరు కలిసి మద్యం సేవించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
……………….
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా బచేలీ ప్రాంతంలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. CISF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశారు. ఈ ఘటనలో ముగ్గురు సాధారణ పౌరులతో పాటు… ఓ జవాను మృతిచెందారు.
……………….
మధ్యప్రదేశ్‌లో సీట్లు దక్కని అభ్యర్థులు వెంటనే ప్రత్యర్థి పార్టీలో ప్రత్యక్షమవుతున్నారు. బీజేపీ సీనియర్ లీడర్సర్‌తజ్ సింగ్‌ మూడో లిస్టులోనూ తనకు సీటు రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకున్నారు.
……………….
ఈడీ అధికారికి లంచం ఇచ్చిన కేసులో బళ్లారి గనుల వ్యాపారి గాలి జనార్థన్‌ రెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది. బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, ఢిల్లీ ఇలా పలుచోట్ల ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
……………….
గుజరాత్ దహోద్‌ జిల్లాలోని భమన్‌ గ్రామంలో ఓ ప్రిన్సిపల్‌ ఏకంగా స్కూల్లోనే రాసలీలలు సాగించాడు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు లేని సమయంలో టీచర్‌ను ముద్దుపెట్టుకున్నాడు. ఆమెతో సరసాలు ఆడాడు.
……………….
మరోవైపు ప్రిన్సిపల్ ముద్దుపెడుతున్న వీడియో బయటకు రావడంతో ఆ లేడీ టీచర్ స్పందించారు. హర్సింగ్‌మాల్ చేతిలో తాను అత్యాచారానికి కూడా గురయ్యానన్నారు. చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని ఇంతవరకు బయటకు చెప్పలేదన్నారు. భర్త తనను అర్థం చేసుకుని, ధైర్యం చెప్పడంతో ప్రిన్సిపల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.
……………….
మన రక్షణ సమాచారాన్ని దొంగిలించడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసినట్లు ఇంటలిజెన్స్ వెల్లడించింది. యూనిట్ 61398 పేరుతో రహస్యంగా మన దేశ భౌగోళిక సమాచారాన్ని సేకరిస్తున్నట్టు హెచ్చరించింది.
……………….
నిఘా వర్గాల హెచ్చరికలతో మన కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ అలర్ట్ అయ్యాయి. సైబర్ దాడులను ఎదుర్కొని చైనాకు గట్టిగా బుద్ది చెప్పడానికి అధికారులు రెడీ అవుతున్నారు.
……………….
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమా సర్కారు చిక్కుల్లో పడింది. రాజకీయ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలోని కొన్ని సీన్లు తొలగించాలని.. లేదంటే చర్యలు తీసుకోవాల్సిన వస్తుందని తమిళాడు న్యాయశాఖ మంత్రి షణ్ముగం హెచ్చరించారు.
……………….
మరోవైపు సీన్లు తొలగించడానికి చిత్రబృందం నిరాకరిస్తోంది. ఇందులో పాత్రలు, పాత్రధారులు అంతా కల్పితమేనని తెలిపింది. సెన్సార్ బోర్డు అనుమతి వచ్చిన తర్వాత సన్నివేషాలు ఎలా తొలగిస్తామంటోంది. దీనిపై అవసరమైతే న్యాయస్థానానికి వెళతామని స్పష్టం చేసింది.
……………….
అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని ఓ బార్‌లోకి చొరబడిన ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
……………….
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు వైభవంగా వివిధ ఉత్సవాలు నిర్వహించనున్నారు. నాలుగు సోమవారాలు 11 మంది రుత్వికులచే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
……………….
పంచారామాల్లో ఒకటైన తూర్పుగోదావరి జిల్లా దాక్షారామం కార్తీక శోభను సంతరించుకుంది. భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ గా తరలివస్తున్నారు.

Also Read : వివాదంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ