బస్సుపై మావోయిస్టు బాంబు దాడి

చత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా బచేలీ ప్రాంతంలో మరోసారి మావోయిస్టులు విరుచుకపడ్డారు. CISF జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశారు. ఈ ఘటనలో నలుగురు సాధారణ పౌరులతో పాటు… ఓ జవాను మృతిచెందారు. ఎన్నికల నేపథ్యంలో విధుల్లో భాగంగా వెళుతున్న వాహనంపై దాడికి తెగబడ్డారు. గడిచిన వారం రోజుల్లోనే ఇది రెండోసారి మావోయిస్టులు దాడి చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలోని బచేలీ సమీపంలో ఓ బస్సుపై బాంబు దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సీఐఎస్‌ఎఫ్‌‌ జవాన్‌ కూడా ఉన్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మావోయిస్టుల దాడి అధికారులకు సవాల్‌గా మారింది.

Also Read : మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా.. 13మంది మృతి

దంతెవాడలో మావోయిస్టులు దాడి చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి. అక్టోబరు 30న మీడియా వర్గాలపై మావోయిస్టులు దాడి చేశారు మావోయిస్టులు. ఎన్నికల ఏర్పాట్లపై కవరేజ్‌కు వెళ్లిన దూరదర్శన్‌ సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ మృతిచెందారు. వారికి భద్రతగా వెళ్లిన ముగ్గురు భద్రతాసిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో నక్సల్స్‌‌ ప్రభావం ఎక్కువగా ఉన్న 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 12న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మిగతా 72 నియోజకవర్గాలకు నవంబరు 20న పోలింగ్‌ నిర్వహించనున్నారు. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. వారి పర్యటనకు ఒక్క రోజు ముందే మావోయిస్టులు దాడికి పాల్పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.