మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా.. 13మంది మృతి

అమెరికాలో మళ్లీ గన్‌ పేలింది. కాలిఫోర్నియాలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి చొరబడిన ఓ వ్యక్తి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గన్‌మెన్‌తో పాటు 13మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని థౌజెండ్‌ ఓక్స్‌ పట్టణంలో ఉన్న బార్డర్‌లైన్‌ బార్‌లో దుండుగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బార్‌లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిగే సమయంలో వంద మందికి పైగా బార్‌లోనే ఉన్నట్లు సమాచారం. పొగ వచ్చే గ్రెనేడ్లను బార్‌లోకి విసిరేసి ఆ తర్వాత కాల్పులు జరపడం ప్రారంభించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Also Read : 10 నిమిషాల్లో 50 వార్తలు..

ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన జనం తలోదిక్కు పరుగులు తీశారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది..దుండగుణ్ని కాల్చి చంపారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించారు. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు గల కారణాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల పిట్స్‌బర్గ్‌లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ ఆగంతకుడు చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా గాయపడ్డాడు.

అమెరికాలో వరుస కాల్పులపై ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.