బేబీ పాటకు ‘కోటి’ ఆఫర్

గత పదిరోజులనుంచి సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ‘ఓ చెలియా నా ప్రియ సఖియా..’ పాట పాడిన కోయిల ఎవరో తెలిసిపోయింది. ఆమె రాజమండ్రికి చెందిన బేబీ గా గుర్తించారు. ఆమె తను పాడిన పాటతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎక్కడ చూసినా ఆమె గొంతు వినిపిస్తోంది. సన్నగా సమ్మోహనంగా పాడిన పాటకు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఆమెకోసం పలు చానళ్లకు ఫోన్లు చేసి వివరాలు ఉంటే చెప్పాలని కోరారు. అయితే ఎట్టకేలకు ఆమె చిరునామా తెలిసింది. తూర్పు గోదావరిజిల్లా రాజమండ్రికి చెందిన వెంకన్న దయాకరుణల కూతురే ‘బేబి’.. పేదరికం కారణంగా బేబి చదువుకోలేదు. ఆమెకు ఇద్దరు కవలపిల్లలు.

Also read :నవంబర్ 24న దగ్గుబాటి వారింట్లో మోగనున్న పెళ్లి బాజా!!

సంగీతం అంటే ఏంటో తెలియదని ఆమె అంటారు. ఎవరైనా పాడితే విని పట్టేసేదాన్ని.. పాట పాడుతుంటే ఏదో తెలియని అనుభూతి అని అంటారామె. బొంబాయి చిత్రంలోని.. ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ అనే సాంగ్ అంటే ప్రాణమని చేప్తోంది. నా చిన్నప్పటి నుంచే అమ్మ నాన్నలు దగ్గర కూర్చోబెట్టుకుని, నేను పలికే వచ్చీరాని పదాలతోనే పాడించుకునేవారు. పొలం పనులకు వెళ్తే అక్కడ అందరూ తనను పాడమని కోరేవారు.. పాడాక పాట బాగుందని అందరూ మెచ్చుకునేవారు. అప్పుడు చాల సంతోషం అనిపిస్తుంది అని అంటారు.

ఇటీవల ఒకసారి పక్క వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో అమ్మాయి ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాటను వేదికల మీద ప్రదర్శనకోసం సాధన చేస్తోంది. ఆ అమ్మాయి పాటలో శృతి సరిగ్గా లేదనిపించింది. వెంటనే ఇలా పాడాలని అని సలహా ఇచ్చాను. దాంతో ఆ అమ్మాయి నాతో ఆ పాట పాడించింది. ఆ సమయంలో ఆమె తనను వీడియో షూట్‌ చేసి, నా అనుమతితో ఫేస్‌బుక్‌లో పెట్టింది. అది ఇంత మందికి చేరువ అవుతుందని.. అందరూ తనను మెచ్చుకుంటారని.. ఎస్పీ బాలు గారు తనను అభినందిస్తారని అనుకోలేదని బేబీ అన్నారు. తన గొంతు విన్న సంగీత దర్శకుడు ‘కోటి’ తన సినిమాలో పాడమని ఆఫర్ ఇచ్చినట్టు ఆమె చెప్పారు. త్వరలోనే ఆడిషన్స్ కు కూడా వెళ్లనున్నట్టు బేబీ చెప్పారు. ఇదిఅలావుంటే ఆమె పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.