డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్న చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోడీ సర్కారు చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపియేతర పార్టీలని ఏకం చేసే పనిని మరింత వేగవంతం చేశారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశారు. గురువారం బెంగళూరులో.. జేడీఎస్ అధినేత దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసిన చంద్రబాబు.. ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. డిఎంకే అధినేత స్టాలిన్‌తోనూ సమావేశం కానున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించుకునేందుకు బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీంటితో ఓ కూటమి ఏర్పాటు చేసే అంశాన్ని స్టాలిన్‌కు వివరిస్తారు.

మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని ఢిల్లీ వేదికగా చెప్పిన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ఫ్రంట్ రూపకల్పన ప్రయత్నాలను చేస్తున్నారు. రాష్ట్రాలపై ప్రధాని మోడీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్న చంద్రబాబు.. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామి భేటీ అనంతరం. తెలిపారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోగా.. ఐటీ, సీబీఐ దాడులతో పేరుతో.. అందరిని భయపెడుతున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు.

Also Read : 10 నిమిషాల్లో 50 వార్తలు..

ఉత్తరాధిలో బీజేపీయేతర పార్టీలతో ఇప్పటికే కలిసి చర్చలు జరిపిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాదిలోనూ.. చక్రం తిప్పుతున్నారు. ఇవాళ డీఎంకే అధినేత స్టాలిన్‌తో కీలక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పోరాటానికి స్టాలిన్‌ మద్దతు ఇవ్వడంతో.. మరింత ఉత్సహాంతో ముందుకెళ్తున్నారు ఏపీ సీఎం.