93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ.. 74 స్థానాలకు అభ్యర్థులు ఖరారు..

karnataka-bjp-lawmakers-still-at-gurgaon-resort-missing-congress-mla-anand-singh-surfaces

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలని నిర్ణయించగా.. సుధీర్ఘ కసరత్తు అనంతరం 74 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక.. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలకు కేటాయించే సీట్ల విషయంపై కాంగ్రెస్‌ ఓ స్పష్టతనిచ్చింది. టీడీపీకి 14, టీజెఎస్‌కు 8, సీపీఐకి 3 చొప్పున సీట్లు కేటాయించింది.

తెలంగాణ అభ్యర్ధుల ఎంపికలో.. కాంగ్రెస్ హైకమాండ్‌ ఓ క్లారిటీ వచ్చింది. 93 స్థానాల్లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన కాంగ్రెస్‌.. అందులో 74 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించింది. శనివారం తొలి జాబితాను విడుదల చేయనుంది. మిగిలిన 20 సీట్లపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమయాన్ని బట్టి ఈనెల 11, 12 తేదీల్లో చర్చించి వెల్లడించనున్నారు. అభ్యర్థుల జాబితాపై గత మూడు రోజులుగా తీవ్ర కసరత్తు చేసింది కాంగ్రెస్‌ హైకమాండ్. పీటముడి ఉన్న స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్‌ కమిటీ అందజేసిన జాబితాను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ నిశితంగా పరిశీలించింది. సోనియా గాంధీ నేతృత్వంలో చర్చించి 74 మంది అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చింది. అలాగే మిత్రపక్షాలకు కేటాయించాల్సిన సీట్ల సర్దుబాటును కూడా ఖరారు చేయడంతో పొత్తుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్టయింది.

Also Read : డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్న చంద్రబాబు

అభ్యర్థులపై నిర్ణయం తీసుకునేందుకు ముందు హస్తినలో భారీ కసర్తతు జరిగింది. ఢిల్లీ వార్‌ రూమ్‌లో బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఆశావహులతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్త చరణ్‌దాస్, శర్మిష్ట ముఖర్జీ చర్చించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం అంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇస్తామని స్పష్టం చేసి… వారిని హామీ తీసుకున్న తరువాతే 74 మంది అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం

ఇక మహా కూటమిలో మిత్రపక్షాలకు 26 సీట్లు కేటాయించింది కాంగ్రెస్‌. ఇందులో టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకి 3, మరో పార్టీకి ఒక స్థానం చొప్పున సీట్లు కేటాయించింది. . కాంగ్రెస్‌ అయితే ఎవరికి ఎన్ని సీట్లన్నదానిపై క్లారిటీ ఇచ్చింది. మరి దీనిపై మిత్రపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. టి.జె.ఎస్‌ 12 సీట్లకు తగ్గితే కుదరదంటున్నట్టు సమాచారం. మరి వారిని కాంగ్రెస్‌ పెద్దలు ఎలా ఒప్పిస్తారో చూడాలి. సీపీఐ సైతం 5 సీట్లైన కచ్చితంగా ఇవ్వాలని పట్టు పడుతోంది. కానీ.. కేవలం 3 సీట్లతోనే సరిపెట్టింది కాంగ్రెస్‌. మరి వీరంతా ఓ మెట్టు దిగి మహా కూటమితో కలిసి నడుస్తారా? లేక.. మహా కూటమి మూడు ముక్కలు అవుతుందా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది.