అమెరికాలో ఉద్యోగం ఇక కష్టమే..భారతీయుల ఆశలపై నీళ్లు

అమెరికాలో వీసాలపై ఆంక్షలు పెడుతున్న ట్రంప్ H1B వీసాలపైనా మార్పులకు సిద్దమవుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి చట్టరూపం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా అవుట్ సోర్సింగ్ వద్దంటున్న ట్రంప్.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. H1B వీసాను ఇక నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన వారికే ఇస్తామంటోంది ట్రంప్ ప్రభుత్వం. ప్రతిభాపాటవాలు ప్రదర్శించి… అమెరికాలోని టెక్నాలజీ రంగంలో వారి సేవలు అవసరమని నిర్దారణకు వచ్చిన తర్వాతే ఆయా నిపుణులకు వీసా ఇస్తామంటున్నారు. దీనివల్ల దేశంలో అక్రమ వలసలు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు. చాలాకాలంగా దేశంలోని నిపుణుల పేరుతో అమెరికా వచ్చి ఉద్యోగులు సంపాదిస్తున్నారని.. వారి వల్ల దేశీయంగా యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ట్రంప్ అంటున్నారు. కేవలం నిపుణులకు మాత్రమే వీసా ఇవ్వడం ద్వారా ఇతర రంగాల్లో అమెరికన్లకు ఉద్యోగాలు పెరుగుతాయని వైట్ హౌస్ చెబుతోంది.

నిపుణులు రాకుండా అడ్డుకోవడం తమ అభిమతం కాదని.. దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వీసాలు ఇవ్వాలన్నది తమ విధానం అంటున్నారు. చాలా కంపెనీలు తక్కువ ఖర్చు పేరుతో నైపుణ్యం లేకపోయినా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి నియామకాలు చేపడుతున్నాయని.. ఇది పరోక్షంగా అమెరికన్లపై పడుతుందన్నారు. అందుకే ఈ విధానానికి స్వస్తి పలికి H1Bలో కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. నైపుణ్యం ఉన్న వారికి అవసరమైతే కొన్నిమినహాయింపులు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. అమెరికా తీసుకుంటున్న తాజా నిర్ణయంపై ఇంకా ఆయా సంస్థలు స్పందించాల్సి ఉంది. దీని వల్ల చైనా, భారత్ కు చెందిన యువతీ, యువకులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నిపుణులను నేరుగా రిక్రూట్ చేసుకుంటేనే వీసా వచ్చే అవకాశం ఉంది. నిపుణులే పంపాలంటూ ఆయా కంపెనీలకు భారంగా మారుతుంది. అమెరికా కొత్త విధానం మేథో వలసలను ప్రోత్సహించే విధంగా ఉంది. అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లేవారి ఆశలపై నీళ్లు జల్లనుంది. ప్రస్తుతం లక్ష 20వేల మందికి ప్రతిఏటా వీసాలు ఇస్తున్నారు. ఇవి గణనీయంగా తగ్గనున్నాయి.