జీపీరెడ్డి భూవివాదం కేసులలో సంచలన నిజాలు..!

వ్యాపారవేత్త జీపీరెడ్డి భూవివాదం కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఉమెన్ వెల్ఫేర్‌ సొసైటీ ల్యాండ్‌ను ఫోర్జరీ పత్రాలతోనే జీపీరెడ్డి.. కొందరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించిట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఈ ల్యాండ్ వివాదానికి సంబంధించిన విచారణ కోసం పోలీసులు.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 65లో ఉన్న జీపీరెడ్డి నివాసానికి వెళ్లారు. ఐతే.. వారెంట్ లేకుండా వచ్చినందున తాను విచారణకు రాలేనని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో లగడపాటి రాజగోపాల్ అక్కడికి చేరుకోవడం, వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. రాత్రంతా ఇంటి నుంచి బయటకు రాని జీ పిచ్చిరెడ్డి.. ఇవాళ ఉదయం దీనిపై స్పందించారు. తాను ఆ భూమిని సక్రమంగానే కొన్నానని వివరణ ఇచ్చారు.

ఈ కేసు విచారణ 2016 నుంచి వాయిదాలు పడుతూనే ఉంది. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమిని.. పిచ్చిరెడ్డి బినామీ పేర్లతో తన సొంతం చేసుసునేందుకు ప్రయత్నించినట్టు ఎం.కృష్ణారెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టారు. ఈ సొసైటీలో తనకు కూడా స్తలం ఉందని దాన్ని కొందరు కబ్జా చేశారని కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణలో భాగంగా.. జి.పిచ్చిరెడ్డితోపాటు 10మందిపై FIR నమోదు అయ్యింది. ఐతే.. దీంతో తనకు సంబధం లేదని, తన పేరు తప్పించాలని కోరుతూ 2017 జులైలో జీపీరెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నపిటిషన్లు కూడా పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ భూమికి సంబందించిన వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసులు తమ ప్రయత్నం చేస్తున్నారు. ఈ విచారణ కోసమే పిచ్చిరెడ్డిని తీసుకెళ్లేందుకు వెస్ట్‌జోన్ పోలీసులు ట్రై చేశారు. సొసైటీ ల్యాండ్ అని తెలియక తాను కొన్నానని, సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని జీపీరెడ్డి అంటున్నారు.

Also Read : ఏపీలోని ఆ గ్రామంలో మహిళలు నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా..!

ఉమెన్స్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి హక్కులపై జీపీరెడ్డి కిందికోర్టులోనూ, హైకోర్టులోనూ కేసు ఓడిపోయారు. తర్వాత సుప్రీంకి కూడా వెళ్లారు. ఇక్కడ ఈ భూకబ్జా ఓ పథకం ప్రకారం జరిగిందని బాధితులు చెప్తున్నారు. వారి మాటల ప్రకారం… “3 ఎకరాల భూమిపై కన్నేసిన జీపీరెడ్డి.. కడప జిల్లా బద్వేల్ నుంచి కొందరు అమాయకులైన ముస్లింలను తీసుచొచ్చాడు. హైదరాబాద్‌లో ప్రస్తుతం అమ్మకానికి ఉన్నది ముస్లింల స్థలమేనని, వారు తమ వర్గానికే అమ్ముతానంటున్నారని చెప్తూ బద్వేల్‌కి చెందిన వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు. తీరా అసలు ఓనర్లు కోర్టుకెక్కడంతో తీగ లాగితే మొత్తం డొంక అంతా కదిలింది. తమకు ఈ భూమితో ఎలాంటి సంబధం లేదని, జీపీరెడ్డి తమను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించారని ఈ కేసులో నిందితులంతా నిజం ఒప్పుకుంటూ జడ్జి ముందు 164 స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ సమయంలో కోర్టు జీపీరెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కస్టడీకి తీసుకుని అతన్ని ప్రశ్నించాలని, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఎలా సృష్టించారు, దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో ముందుగా ఇక్కడ సొసైటీలో స్థలాలు కొని సభ్యులుగా ఉన్న వారందరినీ పోలీసులు విచారించారు. చివరికిప్పుడు జీపీరెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లారు. ఐతే వారెంట్ లేని కారణంగా విచారణకు హాజరుకానని అతను చెప్పడంతో రాత్రంతా హైడ్రామా నెలకొంది. ఇవాళ విచారణకు రావాలని చెప్పి వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్ వెనుదిరిగారు. అటు, అనుమతి లేకుండా జీపీరెడ్డిని విచారణకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించడంపై మాజీ ఎంపీ లగడపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read : అర్ధరాత్రి వ్యాపార వేత్త ఇంట్లో సోదాలు.. అడ్డుకున్న లగడపాటి

జీపీ రెడ్డి పక్కా 420 అంటున్నారు గతంలో ఇతని చేతుల్లో మోసపోయిన పలువురు బాధితులు, వ్యాపార ప్రత్యర్థులు. వివిధ కేసుల్లో జీపీరెడ్డి ఇప్పటికే 3 సార్లు జైల్‌కి వెళ్లారంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు సహా పలుచోట్ల జీపీరెడ్డిపై కేసులు ఉన్నాయంటున్నారు. జీపీరెడ్డి కొన్నేళ్ల క్రితం బెంగళూరులో 1000 కోట్ల రూపాయల విలువైన సొసైటీ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఇదే తరహాలో స్కెచ్ వేశారు. చివరికి అడ్డంగా దొరికారు. దీనిపై అక్కడ కేసు కూడా నమోదయ్యింది. సేమ్.. కర్నాటకలో చేసినట్టే ఇక్కడా తనవి కాని భూముల్ని ఫోర్జరీ ద్వారా సొంతం చేసేందుకు పిచ్చిరెడ్డి ప్రయత్నించారని అంటున్నారు. ఈ కేసులో ఎవరివి అసలు డాక్యుమెట్లో త్వరలోనే తేలదాయని పోలీసులు చెప్తున్నారు.