ఎందుకంత హైప్ క్రియేట్ చేస్తారు: ఆదీ ఫైర్

నిప్పు లేందే పొగరాదు అని ఒకప్పటి సామెతగా చెప్పుకోవాలేమో. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో ఓ చిన్న మాట వినిపిస్తుంది. క్షణాల్లో ఇలా జరిగిందంటూ ప్రచారం. ఆ వార్త నిజమో కాదో నిర్ధారించుకునేలోపు ప్రపంచాన్ని చుట్టేస్తుంది. అది నిజం కాదు బాబోయ్ అని సదరు వ్యక్తి నోరు విప్పి చెప్పిందాకా నమ్మే పరిస్థితి ఉండడంలేదు. కారణాలు ఏమైనా ప్రచారం జరిగిపోతుంది. ఆ తరువాత సవరణలతో మరో వార్త వస్తుంది.

ఓ చానెల్‌లో వస్తున్న కామెడీ షోలోని పార్టిసిపెంట్స్‌లో ఒకరైన హైపర్ ఆది వేసే పంచులకు పగలబడి నవ్వని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్‌లో షో వీడియోలను పోస్ట్ చేస్తే అందులో హైపర్ ఆది వీడియోలకే ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. అంతగా పాపులర్ అయ్యాడు.. అందుకే ఆది కాస్తా హైపర్ ఆది అయ్యాడు.

అయితే కొంత కాలంగా షోలో ఆది కనిపించకపోయేసరికి షో నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా యాక్సిడెంట్ కారణంగానే ఆది కనిపించట్లేదని ప్రచారం జరుగుతోంది. టీమ్ సభ్యులతో పాటు, జడ్జి నాగబాబు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే తనపై వస్తున్న వార్తలలో నిజం లేదని, తనకు యాక్సిడెంట్ కాలేదని, నిక్షేపంగా ఉన్నానంటూ ఆది ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తనకు ఏమీ కాలేదంటూ అభిమానులను ఆందోళన చెందవద్దని కోరాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా.. ప్రస్తుతం షోనుంచి కొన్ని రోజులు దూరంగా ఉండి సినిమాలపై దృష్టి పెట్టాడు. వస్తున్న అవకాశాలను వినియోగించుకోదలిచాడు. వీటితో పాటు విదేశీ ప్రదర్శనలతో ఆది చాలా బిజీగా ఉన్నాడు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో షోకి దూరమయ్యాడు. ఇంతకు ముందు కూడా అమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లినప్పుడు హైపర్ ఆది స్థానంలో రైజింగ్ రాజు వచ్చి ఆది స్థానాన్ని భర్తీ చేశాడు.