ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన సాహసం..

కొందరు చేసే విన్యాసాలు.. కాదు కాదు సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అంత ఎత్తునుంచి పడ్డావంటే అడ్రస్ ఉండవురా బాబూ.. అవసరమా అంటూ చీవాట్లు పెట్టే వాళ్లు ఉన్నా కానీ.. రికార్డు సృష్టించాలంటే సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలంటూ సాహసవీరులు కొత్తగా ఏదో ఒకటి చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఓ సాహసికుడు సైకిల్‌ తీసుకుని అందరిలా రోడ్డు మీద తొక్కితే మజా ఏముందనుకున్నాడో ఏమో.. పోనీ అడవిలో తొక్కాడా అంటే అదీ కాదు.. కొండలు, గుట్టల్లో సైకిల్ మీద ప్రయాణం సరదా అనుకున్నాడు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందే తను ప్రయాణించాలనుకున్న దారిని ఎంచుకుని రూట్ మ్యాప్ గీసుకున్నాడు. అందుకు అనుగుణంగా సైకిల్‌పై సాహసయాత్ర మొదలు పెట్టాడు.

పరికించి చూస్తే కానీ తను సైకిల్‌పై వస్తున్నాడన్న విషయం అర్థం కానంత స్పీడ్‌గా సైకిల్ తొక్కేస్తున్నాడు. నిజానికి సైక్లింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఉదయాన్నే వాకర్స్‌తో పాటు సైక్లింగ్ చేసే వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ ఇక్కడ యువకుడు సైకిల్‌ని ఎత్తైన గుట్టల్లో, కొండల్లోకి పోనిస్తున్నాడు. సర్కస్ విన్యాసాలు చేస్తున్నాడు. అతడి సాహస యాత్రను చూడడానికి దారి పొడవునా జనం నిలబడి చూస్తున్నారు.

గుండె అరచేత పట్టుకుని చూసేవారు కొందరైతే.. బాబోయ్ వీడికి ఎన్ని గుండెలు ఇలా తొక్కేస్తున్నాడు సైకిలు అనే వారు మరి కొందరు. అదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా చెబుతూ ఇలాంటి సాహసం చేయాలంటే అతనికి ఎంతో గుండె ధైర్యం ఉండి ఉండాలని అంటున్నారు. అతడిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని మీరు కూడా ఎంచుకున్న రంగాల్లో సవాళ్లను ఎదుర్కుని ధైర్యంగా ముందుకు వెళ్లమంటున్నారు. తనకి కూడా ఆ యువకుడు ఆదర్శంగా నిలిచాడని చెబుతున్నారు.