ఏపీలోని ఆ గ్రామంలో మహిళలు నైటీ ధరిస్తే రూ.2 వేలు జరిమానా..!

మహిళలు పగటిపూట నైటీ ధరిస్తే 2 వేలు ఫైన్. ఎవరైనా నిబంధన అతిక్రమించినట్టు గుర్తించి, గ్రామపెద్దలకు సమాచారం ఇస్తే, అలా చెప్పిన వాళ్లకు 1000 రూపాయలు బహుమానం. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో వెలుగు చూసింది ఈ వింత తీర్మానం. ఊళ్లో మహిళలు, యువతులు వేసుకునే నైటీలను పెద్దలు నిషేధించారు. ఎవరైనా పగటి పూట నైటీలు వేసుకుంటే వారికి రూ. 2వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీనిపై గ్రామంలో డప్పు వేయించి మరీ ప్రచారం చేశారు.

ఆ నోటా ఈ నోటా విషయం ఇప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో నిడమర్రు తహశీల్దార్‌ ఎం.సుందర్రాజు, ఎస్‌ఐ విజయకుమార్‌ గ్రామంలో పర్యటించారు. వాస్తవాలు తెలుసుకున్నారు. గ్రామపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతా చెప్తున్నా, దీనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమి లేక ఎవరిపైనా చర్యలు తీసుకోకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

మన తెలుగు సంస్కృతి- సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతోనే పగటిపూట.. మహిళలు నైటీలు ధరించి వీధుల్లోకి రాకూడదని గ్రామపెద్దలు చెప్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ నైటీలు నిషేధం అమల్లో ఉంటుందని గ్రామ పెద్దలు ప్రకటించారు.

Also Read : ఏపీలో ఏడేళ్లకోసారి జరిగే జాతర ఇదే..

కొల్లేరులోని లంక గ్రామాల్లో వడ్డి కులస్తులు ఎక్కువగా ఉంటారు. గ్రామంలోని 9 మందిని కుల పెద్దలుగా ఎన్నుకుంటారు. అక్కడ వీరు చెప్పిందే శాసనం. తోకలపల్లిలో మొత్తం 1100 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 3600 ఉంటుంది. ఈ లంక గ్రామాల్లో కట్టుబాట్లకు, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా పాటించని వారు పంచాయితీకి జరిమానా కట్టాల్సిందే. ఈ విధంగా జరిమానా రూపంలో వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తుంటారు. ఉదయం మహిళలు నైటీలు ధరించి బయటకు రాకూడదన్న నిబంధన ఆశ్చర్యకరంగాన ఉన్నా.. ఊళ్లోవాళ్లంతా దీనికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. మొత్తంమీద ఇప్పుడీ నైటీ నిషేధం చర్చనీయాంశంగా మారింది.