వైఎస్ జగన్‌పై దాడి కేసు విచారణ..

jagan-attempt-murder-candidate-srinivas-comments

వైఎస్ జగన్‌పై దాడి కేసుపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు.. పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉన్నాయని.. జగన్ తరఫున న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేతపై ఎటాక్ జరిగితే.. కిందిస్థాయి ఉద్యోగులతో విచారణ చేయిస్తున్నారని అభ్యంతరం తెలిపారాయన. జగన్‌పై జరిగింది హత్యాయత్నమని.. దాని వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. ఆ కత్తి జగన్‌ మెడపై తగిలి ఉంటే.. తీవ్ర పరిణామాలు ఉండేవని జగన్ అడ్వొకేట్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల అజమాయిషీలేని సంస్థతో విచారణకు ఆదేశించాలని హైకోర్టును కోరారు జగన్ తరఫు న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి. ఆపరేషన్ గరుడ పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సినీ హీరో శివాజీ ప్రస్తావన చేశారు. అన్ని వాదనలు విన్న హైకోర్టు.. 161 సీఆర్పీసి ప్రకారం పోలీసుల విచారణకు ఎందుకు సహకరించలేదని ప్రశ్నించింది. దీంతో.. తనకు రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణ నమ్మకం లేదని, ప్రాణాపాయం ఉన్నందునే పోలీసులకు జగన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆయన తరపు న్యాయవాది బదులిచ్చారు. దీంతో.. ఏపీ పోలీసుల విచారణ తీరుపై మీకున్న అనుమానాలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

Also Read : జగన్‌పై దాడి కేసులో నిందితుడి రిమాండ్‌ పొడిగింపు

మరోవైపు.. జగన్‌పై దాడి కేసులో ఇప్పటివరకు జరిగిన సిట్ విచారణపై నివేదికను మంగళవారం సమర్పించాలని ఏపీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో జగన్‌ కత్తిదాడికి గురైన తర్వాత విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ ప్రయాణించేందుకు ఎలా అనుమతించారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎవరు పర్మిషన్‌ ఇచ్చారో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారాని హైకోర్టు వాయిదా వేసింది.