వరంగల్ వజ్రం.. యాప్ ద్వారా ఏటా రూ.25 లక్షల ఆదాయం..

మట్టిలో మాణిక్యం ఈ వరంగల్ వజ్రం. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో తమిళనాడులోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో బీఎఫ్‌టెక్ కోర్సు చేశాడు భాను లక్ష్మణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అంతటి ప్రతిభ ఉన్న దర్శకుడి కంట్లో పడినందుకు సంతోషించాడు. తన కెరీర్ గాడిలో పడిందనుకున్నాడు.

పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే అమ్మ మరణించిన వార్త భానుని మనో వేదనకు గురిచేసింది. ఇక సిటీనుంచి వెళ్లిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఉన్న ఊరిలోనే ఉంటూ తన ప్రతిభకు పదునుపెట్టాడు. కొత్త యాప్‌ని క్రియేట్ చేశాడు.

2015లో 3 లక్షల రూపాయల పెట్టుబడితో షాపిట్‌సూన్.కామ్ ప్రారంభించాడు. ఒకే యాప్‌ ద్వారా పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాడు. షాపింగ్ కోసం షాప్ ఇట్ సూన్, ఈటింగ్ కోసం ఈట్ ఇట్ సూన్, వార్తలు, కరెంట్ అఫైర్స్ కోసం రీడ్ ఇట్ సూన్, ట్రావెల్స్ కోసం రైడ్ ఇట్ సూన్, లావాదేవీల కోసం స్వైప్ ఇట్ సూన్ అనే వేర్వేరు వేదికలు అందుబాటులోకి తీసుకు వచ్చాడు.

వీటన్నింటినీ ఒకే యాప్‌లో పొందుపరచాలనుకున్న భాను ‘పబ్బాస్ యాప్’ ను తయారు చేశాడు. ఈ యాప్ ద్వారా ఏటా 18 లక్షల ఆర్డర్లను.. రూ.25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. భానూ రూపొందించిన ఈ యాప్ ద్వారా మొత్తం 18 రకాల సేవలను పొందవచ్చు.

Read Also:తమలపాకు.. ఆరోగ్యంలో అగ్రతాంబూలం.. తలలో చుండ్రుని సైతం..

మొబైల్ రీచార్జ్ నుంచి ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్ బిల్స్, ఫుడ్, గ్రాసరీ, ట్రావెల్స్, మెడిసిన్స్, డయాగ్నస్టిక్స్, ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్, ప్లంబింగ్, కార్పెంటరీ వర్క్స్ వంటి మరికొన్ని సేవలకు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం పబ్బాస్ యాప్‌లో 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 10 వేల రకాల కిరాణా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

విదేశాల నుంచి కూడా ఆర్డర్లు తీసుకుంటున్నారు. తన సేవలను విస్తరించాలనుకుంటున్నట్లు భాను చెబుతున్నారు. రానున్న రోజుల్లో బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాల్లో కూడా పబ్బాస్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆనందంగా చెబుతున్నారు. మరికొంత మంది స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు భాను లక్ష్మణ్.