తమలపాకు.. ఆరోగ్యంలో అగ్రతాంబూలం.. తలలో చుండ్రుని సైతం..

కవుల వర్ణనలో తమలపాకుకి ప్రధమ స్థానం.. ఆమె అరచేతులు, అరిపాదాలు తమలపాకుల్లా ఎంతో నాజూగ్గా ఉన్నాయంటూ కలానికి రసజ్ఞత జోడిస్తారు.. ఆలయంలోని అర్చకుల చేతిలో తమలపాకుదే పైచేయి.. తాతయ్య అన్నం తిన్న తరువాత అమ్మమ్మ ప్రేమగా చుట్టి ఇచ్చే తాంబూలంలో తమలపాకుదే అగ్రస్థానం.. పెళ్లి, పేరంటం, పూజ, అర్చన, అభిషేకం, విందు, వినోదం అన్నింటా నేనున్నానంటూ పచ్చని ఆకులతో పదిమందినీ ఆకర్షిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో తమలపాకుని ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తారు. తమలపాకులో దాగున్న మరిన్ని మంచి గుణాలు..

* సంప్రదాయబద్దంగా వస్తున్న ఆచారం భోజనం తిన్న తరువాత తాంబూల సేవనం. చేసిన భోజనం సులువుగా జీర్ణం కావడానికి తమలపాకు ఉపకరిస్తుంది.
* ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సిలు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి.
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
* ప్రతి రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడినీటితో తీసుకుంటే బాధిస్తున్న బోధకాలు వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
* క్రమం తప్పకుండా రెండు నెలలపాటు రెండు తమలపాకులు ఐదు మిరియం గింజలను కలిపి తిన్న తరువాత గ్లాస్ నీళ్లు తాగుతుంటే పెరిగిన శరీర బరువు తగ్గి నడుము నాజూగ్గా అవుతుంది.


* జలుబు, దగ్గు బాధిస్తుంటే తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాల పొడి, తేనెలను కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
* చెవుల మీద తమలపాకును గోరు వెచ్చ చేసి పెట్టుకుంటే తల నొప్పి తగ్గుతుంది.
* నెలల చిన్నారులకు ముక్కు కారుతుంటే తమలపాకును వేడిచేసి దానికి కొద్దిగా ఆముదం రాసి ఛాతి మీద ఉంచితే జలుబు తగ్గుముఖం పడుతుంది. ఒక్కసారే కాకుండా తగ్గేంత వరకు పెడుతుంటే చిన్నారులకు రిలీఫ్ వస్తుంది.
* పాటలు పాడేవారు, ఉపన్యాసాలు ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకుని బుగ్గన ఉంచుకుని చప్పరిస్తుంటే ప్రయోజనం ఉంటుంది. గొంతు బొంగురు పోయే అవకాశం ఉండదు. శ్రావ్యమైన కంఠం మీ సొంతమవుతుంది.


* తమలపాకు తినడం వలన లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
* తమలపాకు రసానికి కొద్దిగా మిరియాల పొడి కలిపి మూడు పూటల టీస్పూన్ చొప్పున తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
* తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
* తలలో చేరిన చుండ్రు ఓ సమస్యగా మారుతుంటే తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.