పోరాడినా ఫలితం దక్కలేదు

third t20 match lost westindies

షార్ట్ ఫార్మేట్‌లో భారత్‌కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న వెస్టిండీస్ చివరి టీ ట్వంటీలో పోరాడినా ఫలితం దక్కలేదు. బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడడంతో చెన్నై మ్యాచ్‌లో విండీస్ భారీస్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు మంచి ఆరంభానివ్వగా.. చివర్లో పూరన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. కేవలం 25 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. దీంతో విండీస్ స్కోర్ 180 దాటింది.

ఛేజింగ్‌లో టీమిండియా తడబడింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్‌శర్మ నిరాశపరిస్తే… కెఎల్ రాహుల్ కూడా త్వరగానే ఔటయ్యాడు. అయితే శిఖర్ ధావన్, రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 130 పరుగుల పార్టనర్‌షిప్‌తో 18వ ఓవర్‌ వరకూ వన్‌సైడ్‌గా సాగింది. ధావన్ 92 , పంత్ 58 పరుగులు చేశారు.

అయితే చివరి రెండు ఓవర్లలో విండీస్ బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ధావన్‌, పంత్ ఔటవగా.. కట్టిదిట్టంగా బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు ఒత్తిడి తెచ్చారు. చివరి బంతికి పాండే తీసిన సింగిల్‌తో భారత్ విజయాన్ని అందుకుంది. తాజా గెలుపుతో మూడు మ్యాచ్‌లను సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. అటు ఈ టూర్‌లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన కరేబియనమ్ టీమ్‌ టెస్ట్ , వన్డే సిరీస్‌లతో పాటు టీ ట్వంటీ సిరీస్‌లోనూ చిత్తుగా ఓడింది. ఇదిలా ఉంటే 12 మ్యాచ్‌లలో 11 విజయాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్‌శర్మ రికార్డులకెక్కాడు. అయితే బలహీనంగా ఉన్న విండీస్‌ జట్టుపై ఈ విజయాలు ఆసీస్‌ టూర్‌కు సరైన సన్నాహకంగా చెప్పలేకున్నా…కోహ్లీసేనకు కాన్ఫిడెన్స్ పెంచుతాయనడంలో సందేహం లేదు