2019లో దేశ ప్రధానిని నిర్ణయించేది ఆయనే.. – లోకేష్

minister lokesh eye contact on drinking water project

దుబాయ్‌లో లోకేష్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అక్కడి ఎన్ఆర్ఐ టిడిపి విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో వచ్చేశామని.. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ప్రయాణం మొదలుపెట్టామని లోకేష్ అన్నారు. రాజధాని ఎక్కడో తెలీని పరిస్థితుల్లో.. రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. విభజన చేసిన వారు అసూయపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని స్పష్టంచేశారు.

నదుల అనుసంధానంపై దేశమంతా మాట్లాడుతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి ఆచరణలో చూపించారని లోకేష్‌ అన్నారు. గోదావరి జలాలను పెన్నానదికి తీసుకెళ్తున్నామని చెప్పారు. కరువును చూసి రైతులు భయపడే రోజులు పోతాయన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 5 లక్షల పంట కుంటలు తవ్వాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంటే.. ఏపీలో 10 లక్షల పంట కుంటలు తవ్వించామని లోకేష్‌ గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరత లేకుండా చేసామన్నారు లోకేష్. దీంతో పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయని అన్నారు. కరువు జిల్లా అనంతపురానికి కియా మోటార్స్‌ వచ్చిందన్నారు. ఐటి రంగమంతా హైదరాబాద్‌లో ఉండిపోయినా.. 2019 నాటికి ఏపీలో లక్ష ఐటీ ఉద్యోగాల కల్పన టార్గెట్‌గా పెట్టుకుని పనిచేశామని లోకేష్‌ అన్నారు. విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమరావతికి HCL, తిరుపతికి జోహో వచ్చిందని గుర్తుచేశారు. ఫాక్స్‌కాన్‌ లాంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని లోకేష్ చెప్పారు. ప్రపంచమంతా తిరుగుతూ అమరావతికి ఓ బ్రాండ్ తీసుకొచ్చారని అన్నారు.

ఎన్నారైలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని ప్రచారం చెయ్యాలని లోకేష్‌ కోరారు. ఎన్నారైల సమస్యల పరిష్కారానికి APNRT ఏర్పాటు చేసామని చెప్పారు. తెలుగువారు ఎక్కడ, ఏ సమస్య ఎదుర్కొన్నా, పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని లోకేష్ విమర్శించారు. ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా.. నిలదీసినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే.. దేశం బలంగా ఉంటుందని నమ్మిన చంద్రబాబు.. అన్ని ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేస్తున్నారని లోకేష్‌ చెప్పారు. 2019లో దేశ ప్రధానమంత్రిని చంద్రబాబు నిర్ణయించబోతున్నారని అన్నారు.