భారీ బందోబస్తు మధ్య జగన్‌ యాత్ర

jagan padhayatra updates

వైసీపీ అధినేత జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర భారీ బందోబస్తు మధ్య తిరిగి ప్రారంభమైంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కత్తి దాడి అనంతరం 17 రోజులు విశ్రాంతి తీసుకున్న జగన్‌.. తిరిగి తన యాత్రను విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

295వ రోజు పాదయాత్ర పాయకపాడు నుంచి ప్రారంభం కాగా మేళపువలస, మక్కువ క్రాస్‌ రోడ్‌, ములక్కాయవలస వరకు సాగింది. భోజన విరామ సమయానికి కాశీపట్నం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర చేరుకుంది. అనంతరం పాపయ్య వలస మీదుగా కొయ్యనపేట వరకు జగన్‌ పాదయాత్ర కొనసాగింది. దారి పొడవునా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

జగన్‌ పాదయాత్రలో పాల్గొనే వారికి, ఆయన్ను కలవాలనుకునే వారికి బ్లూ కలర్‌ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు. సెక్యూరిటీ కల్పించేందుకు వచ్చిన పోలీసులకు కూడా గుర్తింపులు కార్డులు ఇచ్చారు. జగన్‌ బస చేసే శిబిరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాదయాత్ర కొనసాగుతున్నంతసేపు డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టారు. సుమారు వంద మంది పోలీసులతో అదనపు భద్రత ఏర్పాటు చేశారు.

ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌తో అడుగేసేందుకు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జగన్‌ పాద యాత్రి కొనసాగించి.. ప్రజల కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు కదిలారు..

ఇవాళ 296వ రోజు పాదయాత్రను.. సాలూరు నియోజకవర్గం, మక్కువ మండలంలోని తన నైట్‌ క్యాంప్‌ నుంచి ప్రారంభింస్తారు. అక్కడ నుంచి కంచేడువలన క్రాస్‌ మీదుగా వెంకటభిరిపురంకు చేరుకుంటారు. అక్కడ లంచ్‌ బ్రేక్‌ తీసుకుని, సాయంత్రం బగ్లందొర వలస, గెద్దలుప్పి జంక్షన్‌ మీదుగా తామరకండి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.