మళ్లీ తెరపైకి వచ్చిన కౌశల్ ఆర్మీ..

బుల్లితెర షో బిగ్‌బాస్ 2 ఓ సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. 16 మంది కంటెస్టెంట్లతో మొదలై చివరికి ఆరుగురు మాత్రం ఫైనల్స్‌కి చేరుకున్నా ఫోకస్ అంతా కౌశల్ మీదే ఉండేది. కారణం అతడి ఆర్మీ చేసిన హడావిడి. అతడు షోలో ఉన్న విధానం కౌశల్ గెలుపుకు ఒక కారణమైతే, బలమైన కారణం మాత్రం ఆర్మీనే అని అందరికీ తెలిసిన విషయం.

రిజల్ట్ ప్రకటించే ఫైనల్స్ రోజు ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత ఆసక్తిగా టీవీసెట్లకు అతుక్కుపోయారు బుల్లి తెర ప్రేక్షకులు. మరే భాషలో లేని పబ్లిసిటీని తెలుగులో కౌశల్ ఆర్మీ తీసుకువచ్చింది. ఆర్మీ తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని నిరూపించింది.

ఇప్పుడు మరో మంచి పనికి మేము సైతం అంటూ కౌశల్ ఆర్మీ ముందుకు వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో తిత్లీ తుఫాను వలన భారీగా నష్టపోయిన బాధితులకు సాయం చేసేందుకు కౌశల్ ఆర్మీ కదిలింది. కౌశల్ తన భార్య తుఫాను బాధిత ప్రాంతాల్లో అభిమానులతో కలిసి పర్యటించారు.

పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు అవసరమైన వస్తు సామాగ్రిని కౌశల్ అందించాడు. ఐదు గిరిజన గ్రామాలను సందర్శించిన కౌశల్ బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించారు. స్థానిక ఎంపీ రామ్మోహన్ నాయుడు దంపతులను కలుసుకున్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.