తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టులు గురి పెట్టారా…? మహిళా మావోయిస్టుల నుంచి నాయకులకు ముప్పు పొంచి ఉందా..? లేడీ సెక్యూరిటీ పోలీసులను నియమించడం వెనక తెలంగాణ పోలీసు శాఖ ఆంతర్యం అదేనా..? అంటే ఔననే అంటున్నాయీ పోలీసు వర్గాలు.

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యనే గడుపుతున్నారు. వేలాది జనం మధ్య నాయకులు ఉన్నప్పుడు వారి భద్రత సవాల్‌గా మారుతుంది. ప్రజల మధ్యలో ఉన్న నాయకులను టార్గెట్ చేయడం సంఘ విద్రోహ శక్తులకు కాస్తా ఈజీగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖ మహిళా పోలీసులను రంగంలోకి దింపింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఐన ఐదుగురు లేడీ పోలీసులను ప్రయోగాత్మకంగా మోహరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఇద్దరు ప్రజాప్రతినిధులను మావోయిస్టులు కాల్చి చంపారు. ప్రజాకోర్టు పేరిట మావోలు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ వ్యవహారంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసు శాఖ, ఇక్కడ అలాంటి చర్యలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. డిపార్ట్‌మెంట్‌లో చురుకుగా పని చేసే లేడీ కానిస్టేళ్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి వేదికల వద్ద నియమిస్తున్నారు. ప్రజాప్రతినిధులను సంఘ విద్రోహ శక్తులు టార్గెట్ చేయకుండా ఈ చర్యలు దోహదం చేస్తాయని పోలీసు శాఖ పేర్కొంటోంది.