అంతు చిక్కని వ్యాధితో క్రికెట్‌కు గుడ్‌బై..

ఎంతో ఇష్టంగా బాలు, బ్యాట్ చేతపట్టాడు. ఆటలో మెలకువలు సాధించి మేటి క్రీడాకారుడిగా ఎదిగాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే స్థాయికి చేరుకున్నాడు. ఇంతలోనే అంతు చిక్కని వ్యాధి అతడి కలలను కల్లలు చేసింది. ‌ఒక్కసారిగా అతడిలో నిస్సత్తువ ఆవరించింది.

ఇష్టం లేకపోయినా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కున్నాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాన్ హేస్టింగ్స్. వైద్యులకు అంతు చిక్కని అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హేస్టింగ్ బౌలింగ్ చేసిన ప్రతిసారి ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరుగుతోంది. నెల రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కున్నాడు.

రన్నింగ్, రోయింగ్, ఫిట్‌నెస్ ఎక్సర్‌‌సైజ్‌లు చేస్తున్నప్పుడు రాని ఇబ్బంది బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తోంది. వైద్యులు ఎన్నో పరీక్షలు చేసినా అతడి ఈ పరిస్థితికి కారణం కనుగొనలేకపోతున్నారు. వైద్యుల సలహా మేరకే ఆట నుంచి పూర్తిగా విరమించుకోవలసి వచ్చింది.

లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు సూచించడంతో ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు 33 ఏళ్ల హేస్టింగ్స్. ఆస్ట్రేలియా తరపున ఒక టెస్టు, 29 వన్డేలు, తొమ్మిది టీ 20లు ఆడిన హేస్టింగ్స్ ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.