ఫ్లిప్‌కార్ట్‌ బిన్నీ రాజీనామాకు కారణాలు ఇవేనా ?

బిన్నీ బన్సల్‌ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సీరియస్‌ పర్సనల్‌ మిస్‌కండక్ట్‌ ( వ్యక్తిగత దుష్ప్రవర్తన) కారణంగా పదవి నుంచి బిన్నీ తప్పుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహణ సంస్థ వాల్‌మార్ట్‌ వెల్లడించింది. అయితే సంస్థ నుంచి బిన్నీ తప్పుకోవడంపై పలు సందేహలు వ్యక్తమవుతున్నాయి.

* గతంలో బిన్నీ బన్సల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సంస్థ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయాన్ని స్వతంత్రంగా బలపరచలేమని పేర్కొన్నాయి.

* మాజీ ప్లిప్‌కార్డు ఉద్యోగిపై బిన్ని బన్సల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బిన్ని ఖండించారు. ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఈ విషయం కూడా అతని రాజీనామకు దారితీసి ఉండవచ్చని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి.

* ఆరు నెలల కిత్రం అంతర్జాతీయ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాలను కొనుగోలు చేసింది. వాటి విలువ 1,600 కోట్ల డాలర్ల (రూ.1.15 లక్షల కోట్లు). ఈ వాటాలను బిన్నీ బన్సల్‌, మరో కో ఫౌండర్‌ సచిన్‌ బన్సల్‌ వాల్‌మార్ట్‌కు విక్రయించారు. సచిన్‌ బన్సల్‌ తన వాటాలను పూర్తిగా వాల్‌మార్ట్‌కు విక్రయించి సంస్థ నుంచి తప్పుకున్నారు.కాగా బిన్నీ బన్సల్‌ మాత్రం సంస్థలో స్వల్ప వాటా ను ఉంచుకోవటమే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంతకాలంగా కంపెనీలో కొన్ని రిస్క్‌లు తలెత్తుతున్నాయి. సంస్థ సీఈఓగా బిన్నీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, వాల్‌మార్ట్ డామినేషన్ కొనసాగుతుండడంతో మనస్థాపానికి గురై రాజీనామా చేసినట్లుగా సమాచారం.

* బిన్నీ వ్యక్తిగత దుష్ప్రవర్తన సంబంధించి కంపెనికి చెందిన మాజీ ఉద్యోగి ఒకరు సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి వాల్‌మార్ట్‌ ఒక ప్రైవేట్ దర్యాప్తు సంస్థతో కలిసి విచారణ జరిపినట్లుగా సంస్థ సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిర్యాదిదారు కొన్నాళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీతో కలిసి పనిచేశారని, ప్రస్తుతం ఆమె తన సొంత వెంచర్‌ నిర్వహిస్తున్నట్లుగా వివరించాయి. కానీ ఫిర్యాదుదారు ఆరోపణలకు తగ్గట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.విచారణ అనంతరం బన్సల్ సంస్థ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారని, ఆరోపణల పై బిన్నీ స్పందించిన తీరులో పారదర్శకత లోపించడం కారణంగానే అతని రాజీనామాను ఆమోదించామని వాల్‌మార్ట్‌ తెలిపింది.

* తనపై ఆరోపణలపై బిన్నీ స్పందించారు. రాజీనామాకు గల కారణాలను తెలుపుతూ సంస్థ ఉద్యోగులకు బిన్నీ ఈ -మెయిల్‌ పంపారు. వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలు తనను దిగ్ర్భాంతికి గురి చేశాయన్నారు. పేరు లేని ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా తనపై దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు వార్తలు రావటంతో ఆవేదన చెందానన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. సీఈవో పదవి నుంచి తప్పుకునేందుకు సరైన సమయం వచ్చిందని బన్సాల్‌ తెలిపారు. అత్యంత అనుభవజ్ఞులైన కళ్యాణ్‌, అనంత్‌, సమీర్‌ చేతుల్లోకి సంస్థ వెళుతోందని భవిష్యత్‌లో సంస్థను మంచి ఫలితాలు సాధించేలా వారు ముందుకు తీసుకువెళతారన్న నమ్మకం తనకుందని బన్సల్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్ధితి తనకు, తన కుటుంబానికి సవాళ్ల సమయం లాంటిదని బన్సల్‌ పేర్కొన్నారు. కళ్యాణ్ కృష్ణ మూర్తి నూతన సీఈవోగా సంస్థ ప్రకటించింది.