చలికాలంలో పొడి చర్మం.. ఇంట్లోనే చక్కని వైద్యం

శీతాకాలం వెచ్చగా దుప్పటి ముసుగు కప్పి పడుకోవడానికి బావుంటుంది. లేలేత కిరణాలు మేనుని తాకితే వెచ్చగా హాయిగా ఉంటుంది. అప్పటి వరకు బద్దకంగా ఉన్నవారు కాస్తా బద్దకానికి బై చెప్పేసి పనుల్లో నిమగ్నమైపోతారు. అటు విపరీతంగా ఎండ లేకుండా, ఇటు వర్షం లేకుండా వాతావరణం హాయిగొల్పుతుంది.

అంతా బావున్నా చర్మానికి మాత్రం చేటు తెచ్చేది ఈ కాలంలోనే. శీత గాలులకి చర్మం పొడిబారుతుంది. జీవాన్ని కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది. పెదాలు పగులుతాయి. డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ కాలం మరింత కష్టం. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. మరీ ఇబ్బంది పెడితే ఓ సారి వైద్యుడిని కలవడం మంచిది. కొన్ని సులువైన పద్ధతులు..

* తేనె మరియు పాలు: తేనె, కాగబెట్టని పచ్చిపాలతో మాయిశ్చరైజర్. దీని కోసం 2 స్పూన్స్ తేనెకు 6 స్పూన్స్ పాలు కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. బాగా కలిసిపోయిన తరువాత ముఖం మీద నిదానంగా మర్దనా చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి, తరువాత చల్లని నీటితో శుభ్రపరచుకోవాలి.

* అరటి మాస్క్: అరటి పండు రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో పోషకాలను అందిస్తుంది. శరీరానికి కావలసిన సహజసిద్ధమైన తేమ లక్షణాలను పెంపొందిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మాస్క్ తయారు చేసుకోవడానికి పండిన అరటి పండులో సగ భాగం, పెరుగు 1 స్పూను, తేనె 1 స్పూను కలిపి బాగా బ్లెండ్ చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకున్న తరువాత ఈ మాస్క్ అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే చర్మం తేమగా ఉంటుంది.

* ఓట్‌మీల్ మాస్క్: చర్మం పగుళ్లకు ఈ మాస్క్ ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఓట్స్‌ని మెత్తని పొడిలా చేసి 1 స్పూన్ తీసుకోవాలి. దాని 1 స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ మొత్తాన్ని బాగా కలిపి శరీరానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

చలిగా ఉందని వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే చర్మం ఇంకా పొడిగా మారుతుంది. గోరు వెచ్చని నీరు శ్రేయస్కరం. అలాగే దాహంగా లేకపోయినా తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుంది. ఈ సీజన్‌లో దొరికే పండ్లు తీసుకుంటూ ఉంటే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.