పింక్ డైమండ్ @ రూ.360 కోట్లు

telangana cash for votes huge money goods

అత్యంత అరుదైన, ఎంతో అందమైన గులాబీ రంగు వజ్రం పింక్‌ లెగసీ రికార్డు సృష్టించింది. వేలంలో ఏకంగా 50మిలియన్‌ డాలర్లు పలికి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన వేలంలో పింక్‌ డైమండ్ సుమారు 360కోట్లు పలికింది. అమెరికాకు చెందిన హ్యారీ విన్‌స్టన్‌ సంస్థ దక్కించుకుంది. వెంటనే వజ్రానికి విన్‌స్టన్‌ పింక్‌ లెగసీ అని పేరు మార్చారు.

పింక్ లెగసీ 19 కేరట్ల బరువుంటుంది. వేలంలో ఈ డైమండ్‌ ఒక్కో క్యారెట్‌కు 2.6 మిలియన్‌ డాలర్లు పలికిందని క్రిస్టీస్ సంస్థ వెల్లడించింది. ఈ తరహా వజ్రాలలో అత్యధిక ధర పలికిన వజ్రంగా పింక్ లెగసీ రికార్డు సృష్టించిందని క్రిస్టీస్ పేర్కొంది. పింక్‌ డైమండ్లలో గతంలో ఎన్నడూ క్యారెట్‌కు ఇంత ధర పలకలేదని క్రిస్టీస్‌ తెలిపింది.

 

Also Read : బంగారపు ఐస్‌క్రీమ్ తిన్న బాలీవుడ్ బ్యూటీ

పింక్‌ లెగసీ డైమండ్‌ దక్షిణాఫ్రికాకు చెందిన బిలియనీర్ల కుటుంబమైన ఓపెన్‌ హైమీర్‌ కుటుంబానికి చెందినది. దాదాపు శతాబ్దం క్రితం ఇది దక్షిణాఫ్రికా గనుల్లో లభ్యమైంది. 1920ల్లో ఆ వజ్రానికి సానపెట్టి మెరుగులు దిద్దారు. ఇది చాలా అద్భుతమైన వజ్రమని, 10 క్యారెట్ల కంటే ఎక్కువ బరువు ఉండే పింక్‌ డైమండ్లు చాలా అరుదు అని క్రిస్టీస్‌ పేర్కొంది.

గత ఏడాది నవంబరులో హాంకాంగ్‌లో జరిగిన వేలంలో 15క్యారెట్ల బరువైన పింక్‌ డైమండ్‌ 32.5మిలియన్‌ డాలర్లు పలికింది. ఆ రికార్డును పింక్‌ లెగసీ డైమండ్‌ అధిగమించింది. అయితే వజ్రాన్ని ఇప్పుడు అమ్మిన వారెవరు అనే విషయాన్ని మాత్రం క్రిస్టీస్‌ వెల్లడించలేదు.