
టెక్నాలజీ పెరిగింది. కూర్చున్నచోటుకే అన్నీ వచ్చేస్తున్నాయి. టీవీ చూడాలంటే రిమోట్‌కి పని చెప్పాలి. ఇంట్లో ఇద్దరు చిన్నారులు వుంటే వారికి నచ్చిన చానెల్ పెట్టుకోవాలని రిమోట్ కోసం కొట్టుకుంటూ దాన్ని ఎక్కడో పడేస్తారు. ఎక్కడ వుందో వెతుక్కోవడం ఓ పని. ఇందంతా కష్టం బాస్ అని కంటి చూపుతోనే మార్చేయొచ్చేమో ట్రై చేద్దామని ప్రయత్నిస్తున్నారు.
శాంసంగ్ కంపెనీ రిమోట్ అవసరంలేని టీవీని తయారు చేస్తోంది. స్విట్జర్లాండ్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరల్ డిలాసాన్ (EPFL) కు చెందిన సెంటర్ ఆఫ్ న్యూరోప్రోస్తటిక్స్తో కలిసి ప్రాజెక్ట్ పొంథియస్ను చేపట్టింది. గత వారం శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన డెవలపర్ కాన్ఫరెన్స్‌లో దీని గురించి వివరించింది.
టీవీ సెట్‌తో మనిషి మెదడును కలిపేలా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ (BCI) అనే వ్యవస్థను వాడుకుంటోంది. 64 సెన్సర్లున్న హెడ్సెట్, కంటి కదలికలను పసిగట్టి ట్రాకర్లు బీసీఐలో ఉంటాయి. ఆ హెడ్‌సెట్‌ను తలకు పెట్టుకుని కంటి సైగలతో చానెల్స్‌ను మార్చేయొచ్చు. ప్రస్తుతం ప్రారంభదశలో ఉన్న ఈ ప్రయోగం త్వరలో పూర్తి స్థాయిలో రూపుదాల్చనుంది.