ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

cm chandrababu serious on central govt

ఉత్తరాంధ్ర జిల్లాలను సశ్య శ్యామలం చేసే ప్రతిష్ఠాత్మక సుజల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ‘బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పేరుతో ఈ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అనంతరం చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్‌-1ను వీలైనంత త్వరగా పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేశామని.. ఈ నెలలోనే గోదావరి, పెన్నా నదుల్ని కూడా అనుసంధానం చేస్తామన్నారు. నీళ్ల కోసం మైళ్ల కొద్దీ బిందెలతో ఆడబిడ్డలు నడుచుకుంటూ వెళ్లి కష్టపడ్డారని.. రాబోయే రెండేళ్లలో ఎవరూ నీటికోసం బయటకు వెళ్లే పనిలేకుండా ఇంటింటికీ కుళాయి ద్వారా నీరందిస్తామన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా.. మే నెల నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్నారు.

బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు చంద్రబాబు. సీబీఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని.. ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల తీవ్ర సమస్యలు వచ్చాయని.. రూపాయి విలువ పడిపోయిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయన్నారు. దేశాన్ని కాపాడుకోవాలనే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేసే బాధ్యత తీసుకున్నానని తెలిపారు… హేతుబద్ధత లేని విభజనతో రాష్ట్రం నష్టపోయిందని.. రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఉన్నా.. ప్రజలు బాధలు పడకుండా తాను కష్టపడి పనిచేస్తున్నానన్నారు చంద్రబాబు. అయినా పేదలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నేరవేరుస్తుందన్నారు.