భార్యను చంపి.. ప్రియుడుతో కలిసి ఆస్ట్రేలియా పారిపోయాడు

భార్య పేరు మీద ఉన్న 2మిలియన్ పౌండ్లు(రూ.18.41 కోట్లు) ఇన్సూరెన్స్ కోసం దారుణ హత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. తర్వాత తన ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాకు పారిపోయేందుకు ప్రయత్నించాడు . యూకేలోని మిడిల్ సబ్ రఫ్ హోమ్ లో మే 14న ఈ సంఘటన చోటుచేసుకుంది. తాజాగా ఈ హత్య కేసును టీస్ సైడ్ క్రౌన్ కోర్టు విచారించింది. ఈ ఘటనకు సంబంధించినవివరాలు వెలుగులోకి వచ్చాయి

మితిష్ పటేల్ కు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు జెస్సికా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
వీరి పరిచయం ప్రేమగా మారి ఏడేళ్ళ క్రితం వివాహం చేసుకున్నారు. ఫార్మాసిస్టైన మితిష్ పటేల్ భార్యతో కలిసి ఫార్మసిని రన్ చేస్తుండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని అసలైన బుద్ధి బయటపడింది.

మితిష్ పటేల్ స్వలింగ సంపర్కుడు, తరుచుగా గే నెట్‌వర్కింగ్ యాప్ గ్రైండర్‌(Grindr)లో చాట్ చేస్తూ ఓ యువకుడితో పరిచయం పెంచుకున్నాడు. చివరకు ఆ యువకునితో కలిసి ఆస్ట్రేలియాకు పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. భార్యను చంపి ఆమె పేరు మీద ఉన్న పలు జీవిత బీమా పాలసీలను తీసుకొని యువకుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లుగా విచారణ అధికారి క్యాంప్ బెల్.. కోర్టుకు తెలిపారు.

మితిష్ తన భార్యను చంపేందుకు ఐదేళ్ళుగా ప్లాన్ చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఎలా హత్య చేయాలన్న దానిపై ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసినట్లుగా న్యాయస్థానానికి దర్యాప్తు అధికారి వివరించారు. నాన్ డయాబెటిక్ అయిన తన భార్యకు ఎంత మెుత్తంలో ఇన్సులిన్‌కు ఇస్తే చనిపోతుందనే విషయాన్ని నిందితుడు నెట్‌లో వెదికిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత తిరిగి జీవితాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలి.. ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలనే అంశాలను కూడా అతను శోధించినట్లుగా విచారణలో వెల్లడైంది.

ఆమెను హత్య చేసే రోజు ఎప్పటిలా కాకుండా, సీసీ కెమెరాలు లేని ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశించాడని.. తాడుతో ఆమె చేతులను కట్టివేసి, ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్‌తో ఆమెను చంపినట్లుగా దర్యాప్తు అధికారి న్యాయస్థానానికి తెలిపారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.