బీభత్సం సృష్టిస్తోన్న గజ తుపాన్.. 20 మంది మృతి

cyclone

గ‌జ తుపానుకు 20 మంది మృతి చెందారు. 7 జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు, రేపు కూడా సెలవు ప్రకటించినట్టు అధికారులు తెలియజేశారు. తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. నాగపట్టణం, వేదారణ్యం మధ్య తుపాను తీరం దాటడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తమిళనాడు రాష్ట్రాన్నివణికించిన గజ తుపాను గురువారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తీరం దాటింది. నాగ పట్నం, వేదారణ్యం మధ్య తుపాను తీరం దాటగా, ఆ సమయంలో గంటకు 110నుంచి 120కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

త‌మిళ‌నాడులోని నాగ‌ప‌ట్ట‌ణం, పంబ‌న్, క‌డ‌లూరు, కారైకల్, పుదుకొట్టై తదితర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా నాగపట్నాన్ని గజ తుపాను అతలాకుతలం చేసింది. సైక్లోన్ ధాటికి వందలాది ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంబాలు, భారీ వృకాలు నేలకూలాయి. విరిగి పడిన ఇళ్లు, తెగిపడిన కరెంటు తీగలు, కూలిన చెట్లు, ఎగిరి పోయిన పైకప్పులు, నిలువ నీడ లేకుండా వర్షంలో తడుస్తున్న పేదలు… నాగపట్నం ప్రాంతంలో ఇప్పుడు ఎటు చూసినా కనిపిస్తున్నవి ఇటువంటి హృదయ విదారక దృశ్యాలే.

నాగపట్నం రైల్వే స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. భీకర గాలులకు, ప్లాట్ ఫామ్ లపై ఉన్న షెడ్లు ఎగిరిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థ ధ్వంసమైంది.కారైకల్, పుదుక్కొట్టై జిల్లాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ స్థంబాలు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో నాలుగు జిల్లాలు చీకట్లో మగ్గుతున్నాయి. రహదారులపై భారీ వృక్షాలు పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

తుపాను బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. బాధితులకు ఆహారం, నిత్యావసరాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ, కోస్టుగార్డు బృందాలు రంగంలోకి దిగాయి. కడలూరు, నాగ పట్నం, తిరువాయూరు, రామనాథపురం, తంజావూరుల్లో 471 పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 80 వేల మందికి పైగా బాధితులకు ఆశ్రయం కల్పించారు. మొత్తం 3 వేల 500 మంది సహాయక సిబ్బందిని రంగంలోకి దించిన ప్రభుత్వం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది.

తీరం వెంబడి సహాయక చర్యల కోసం 8 నౌకలు, 2 డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ లను మోహరించామని నౌకాదళం తెలిపింది. ఐఎన్ఎస్ రణ్‌వీర్, కంజార్ యుద్ధ నౌకలు సముద్రంలో సిద్ధంగా ఉన్నాయని తూర్పు నౌకాదళం అధికారి తెలిపారు. కేరళపై కూడా గజ తుపాను ప్రభావం చూపింది. కొల్లాం, పథనమిట్ట, ఇడుక్కీ, కొట్టాయం, ఎర్నాకుళం, అలప్పుళల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై కూడా గజ ఎఫెక్ట్ పడింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.