శబరిమలలో కీలక పరిణామం

Sabarimala-temple-Supreme-Court-verdict-kerala-women

గేట్లు తెరుచున్నాయి.. ఎంట్రీ మాత్రం లభించలేదు.. స్వామి సన్నిధానం కాదు కదా అసలు ఎయిర్‌పోర్టు దాటి ముందుకు కదలలేకపోయారు. ఆచారాలు-సంప్రదాయాలపై భక్తుల పట్టుదలతో సామాజిక కార్యకర్తలు వెనక్తి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికి వెనక్కి తగ్గినా మళ్లీ కచ్చితంగా వచ్చి, దర్శనం చేసుకొని వెళ్తామని సామాజిక కార్యకర్తలు అల్టిమేటమ్ ఇచ్చారు.

దర్శించుకొని తీరాతమంటూ సామాజిక కార్యకర్తలు, ఎలా దర్శించుకుంటారో చూస్తామంటూ భక్తుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో వార్‌ జోన్‌గా మారిన శబరిమలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మండ‌ల మ‌క‌ర‌విల‌క్కు పూజ‌ల కోసం అయ్య‌ప్ప స్వామి ఆల‌య త‌లుపులను తెరిచారు. శుక్రవారం సాయంత్రం 5 గంట‌ల‌కు భక్తుల శరణుఘోష మధ్య ప్రధాన అర్చకుడు కందరవు రాజీవరు ఆలయ ద్వారాలను తెరిచారు.

ప్రధాన పూజారి హారతి ఇవ్వడంతో మండల మకర విళక్కు ఉత్సవం మొదలైంది. సుమారు 62 రోజుల పాటు తెరిచే ఉండనుంది. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు.

శ‌బ‌రిమ‌ల ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. స్వామిని దర్శించుకుంటానంటూ భూమాతా బ్రిగేడ్ నాయకురాలు
తృప్తీ దేశాయ్‌, ఆరుగురు మహిళలతో కలసి ముంబై నుంచి కోచీకి రావడం ఉద్రిక్తతకు దారి తీసింది. కోచీ ఎయిర్ పోర్టులోనే తృప్తి దేశాయ్‌ బృందాన్ని అయ్యప్ప భక్తులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కోచీ విమానాశ్రయం ఎదుట ఆందోళనకారులు చప్పట్లు చరుస్తూ అయ్యప్ప నామ స్మరణతో తమ నిరసన తెలిపారు. తృప్తీ దేశాయ్ బృందాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా శరణు ఘోషతో అడ్డుకున్నారు. తృప్తీని పంబకు తీసుకువెళ్లడానికి క్యాబ్ డ్రైవర్లు కూడా నిరాకరించారు.

స్వామిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తృప్తీ దేశాయ్ తెగేసి చెప్పారు. ఇది మరింత రగడకు దారి తీసింది. ఎయిర్ పోర్టు వెనక గేటు నుంచి సన్నిధానానికి వెళ్లాలని ప్రయత్నించగా, అక్కడ కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో తృప్తీ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

అయ్యప్ప భక్తులు, స్థానికుల తీవ్ర వ్యతిరేకత కారణంగా సుమారు 12 గంటల పాటు తృప్తీ దేశాయ్ ఎయిర్‌ పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. తృప్తీ దేశాయ్, అయ్యప్ప సన్నిధానానికి వెళ్లాలనుకుంటే తమ గుండెల మీద నుంచి నడిచి వెళ్లాలి అంటూ అయ్యప్ప భక్త సంఘం అధ్యకుడు, సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ హెచ్చరించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. చివరకు తృప్తీ దేశాయ్ వెనక్కి తగ్గారు. పోలీసులు పదే పదే నచ్చ చెప్పడంతో కోచీ నుంచి మహారాష్ట్రకు తిరిగి వెళ్లారు.

తాజా పరిణామాల నేపథ్యంలో పంబ పరిసరాల్లో 15 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు. సుమారు 920 మంది మహిళా పోలీసులు కూడా భద్రతా బృందంలో ఉన్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్‌, రెండు ద‌ళాల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను శ‌బ‌రిమ‌ల వ‌ద్ద మోహరించారు. ముందు జాగ్రత్తగా నీలక్కల్, పంబ, సన్నిధానం సహా శబరిమల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు.

శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న మహిళలపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల ప్రవేశానికి మహిళా కార్యకర్తలకు ఎందుకంత ఆత్రుతో తనకు అర్థం కావడం లేదన్నారు. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక దాడులు, విద్వేషాలతో మహిళలు బాధపడుతున్న గ్రామాలకు వెళ్తే బాగుంటుందని హితవు పలికారు. బాలికలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ, సమాన వేతనాలు పొందడానికి అవకాశాలు లేని గ్రామాలకు వెళ్తే మంచిదన్నారు.