విశాఖలో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్న ధోని

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీకి విశాఖతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ ధోనీ విశాఖలోనే ఆడాడు. 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహి సెంచరీతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ధోనీ ఏ స్థాయికి చేరుకున్నాడో అందరికీ తెలుసు. తనకి ఎంతగానో అచ్చొచ్చిన విశాఖ అంటే ధోనీకి ఎంతో ఇష్టం. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాడు కూడా. ఇప్పుడు ఈ నగరంతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకోబోతున్నాడు. తాను ఎంతగానో అభిమానించే విశాఖ సాగర తీరంలో రూ.60 కోట్ల వ్యయంతో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ధోనీకి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఎండి మిహిర్ దివాకర్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాస్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. రెండు దశల్లో ఈ అకాడమీ నిర్మాణం పూర్తి చేయనున్నట్టు ధోనీ టీమ్ వెల్లడించింది. కాగా ధోనీ నిర్ణయంతో విశాఖ క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువ క్రీడాకారులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.