చచ్చి బతికాన్రా.. దేవుడా..

దగ్గర దారి అనుకున్నాడు. దాటే ప్రయత్నం చేశాడు. అదృష్టం బావుండి చావు తప్పి కన్నులొట్ట పోయినంత పనైంది. బతుకు జీవుడా.. నాకు భూమ్మీద నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి కామోసు అనుకున్నాడు ఓ రైలు ప్రయాణీకుడు.

అనంతపురం రైల్వే స్టేషన్‌లో లఖ్‌నవూ-యశ్వంతపూర్ రైలు వచ్చి రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై ఆగింది. అందులో నుంచి దిగిన ప్రయాణికుడు వెంటనే మొదటి ప్లాట్‌ఫాంపైకి వెళ్లాలనుకున్నాడు. కొద్ది దూరంలో ఆగి ఉన్న గూడ్సు రైలు కనిపించింది. అప్పుడే కదలదనుకున్నాడు. కానీ అతడు ట్రాక్ దాటడానికి ప్రయత్నించే లోపు గూడ్సు రైలు వచ్చేస్తోంది.

ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పట్టాలపై పడుకున్నాడు. బతికితే ఇంటికి.. లేకపోతే పైకి అనుకున్నాడు. నిమిషం పాటు ఊపిరి బిగబట్టాడు. ఇంతలో రైలు అతడి మీద నుంచి వెళ్లి పోయింది. బతుకు జీవుడా అనుకుని లేచి పడిపోయిన తన చెప్పును తీసుకుని పరుగు లంకించాడు.

దీన్నంతటినీ గమనించిన ప్రయాణీకులు అతడు క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణీకుల్లో ఒకరు ఈ దృశ్యాన్నంతటిని తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అయితే రైల్వే పోలీసులకు ఈ ఘటనపై ఎలాంటి సమాచారం అందలేదు.

స్పందించిన అధికారులు గూడ్సు రైలు కాబట్టి బతికి పోయాడని.. అదే మామూలు రైలు అయితే టాయిలె‌ట్స్‌ లోని నీళ్లు అతడిపై పడి ప్రమాదం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు.