ఆ విషయం చెప్పి ప్రధాని మోదీ మాట తప్పారు : సీఎం చంద్రబాబు

dharmaporata dheeksha in nellore

విభజన హామీల విషయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తీరుకు నిరసనగా ధర్మ పోరాటం చేపట్టిన తెలుగు దేశం పార్టీ, తాజాగా నెల్లూరులో ధర్మ పోరాట దీక్ష నిర్వహించింది. స్థానిక SVGS కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన దీక్షకు సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. టీడీపీ కార్యకర్త లతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా, ఏపీ విషయంలో మోదీ సర్కారు ధోరణిని ప్రజలకు చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో చేయబోయే పోరాటం, కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, అందుకే అన్ని విపక్షాలతో కలసి కూటమి నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Also read : ఛత్తీస్‌ఘడ్‌లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. ఎంత శాతమంటే..

ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన మోదీ ఇప్పుడు మాట తప్పారని విరుచుకుపడ్డారూ ఏపీ సీఎం.
ప్రపంచంలోనే బ్రహ్మాండమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో మోదీ సర్కారు విఫలమైందన్నారూ చంద్రబాబు. అహ్మదాబాద్-ముంబై కారిడార్‌కు వేల కోట్లు కేటాయించిన కేంద్రం, చెన్నై-విశాఖ కారిడార్‌కు ఎందుకు నిధులివ్వడం లేదని ప్రశ్నించారు. పటేల్ విగ్రహానికి 3 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, విశాఖ, విజయవాడ మెట్రోలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్రం జాప్యం చేస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. కేంద్రం నిర్మించకపోతే తామే ఉక్కు కర్మాాగారాన్ని నిర్మించుకుంటామన్నారు.

తెలుగు రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలన్నదే తమ అభిమతమన్నారూ చంద్రబాబు. తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడడంలో జగన్, పవన్‌ కళ్యాణ్‌ విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. పిరికితనం, స్వార్ధ ప్రయోజనాలతో వారిద్దరూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని ధ్వజమెత్తారు.