తెలంగాణ బరిలో ఉన్న కోటీశ్వరులు వీరే..!

తెలంగాణ బరిలో కోటీశ్వరులు సంఖ్య భారీగానే పెరిగింది. ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఆస్తుల వివరాలు కూడా బహిర్గతమయ్యాయి.. అఫడవిట్లు సమర్పించిన అభ్యర్ధులు ఆస్తులు.. అప్పులపై ప్రమాణపత్రాలు అందించారు. ఒకటి కాదు… పది కాదు.. ఏకంగా వందల కోట్ల రూపాయల ఆస్తులున్న వారు కూడా రేసులో ఉన్నారు. కుటుంబ ఆస్తుల విలువ వంద కోట్లు దాటిన వారు ఐదుగురున్నార. చాలామంది ఆస్తుల్ని మార్కెట్‌ రేటులో లెక్కగట్టినా, కొనుగోలు ధరలో చూసినా కోట్లు దాటుతున్నాయి. 10 కోట్ల నుంచి 50 కోట్ల మధ్య ఆస్తులున్నవారిలో కూటమి నుంచి 29 మంది, టిఆర్ఎస్‌లో 31 మంది, బీజేపీలో 10మంది ఉన్నారు. కోటి కంటే తక్కువ ఆస్తులున్నవారు అత్యల్పంగా ఉండడం విశేషం. టీఆర్ఎస్‌ లో 7గురు, మహాకూటమి నుంచి 9 మంది, బీజేపీ నుంచి 13 మంది ఆస్తులు కోటిలోపే ఉన్నాయి.

మహాకూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురు వంద కోట్ల మార్కును దాటారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరున్నారు. అందరికంటే శ్రీమంతునిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలిచారు. ఆయన వ్యక్తిగత, కుటుంబ ఆస్తుల మొత్తం 314 కోట్లకు పైగానే ఉన్నాయి. మరో స్థిరాస్తి వ్యాపారి కె.అనిల్‌కుమార్‌రెడ్డి భువనగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అఫడివిట్‌ ప్రకారం ఆయన ఆస్తులు 151 కోట్లకు పైమాటే. మహాకూటమి తరపున టీడీపీ నుంచి బరిలో దిగిన ఖమ్మం అభ్యర్ధి నామా నాగేశ్వరరావు కుటుంబ ఆస్తులను 110 కోట్లుగా చూపించారు. ఇక బీజేపీలో తరపున శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తున్న యోగానంద్‌ తమ కుటుంబానికి 146 కోట్లు ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. నాగర్‌కర్నూలు నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యాపారవేత్త మర్రి జనార్దన్‌రెడ్డి తన ఆస్తులను 161 కోట్లుగా చూపించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడు, మంత్రి కేటీఆర్‌ తన ఆస్తులను 41కోట్లకు పైగా చూపించారు. మధిర టిఆర్ఎస్‌ అభ్యర్థి కమలరాజు… తన చేతిలో చిల్లగవ్వ కూడా లేదని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. కోటి విలువైన ఆస్తులు కూడా లేని అభ్యర్థులు ప్రధాన పార్టీల నుంచి కొందరున్నారు.

తమపై ఉన్న కేసుల వివరాలు కూడా అభ్యర్ధులు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అత్యధికంగా 64 కేసులున్నాయి. ఆ తర్వాత సోయం బాపూరావుపై 52 కేసులు, ఆత్రం సక్కుపై 47 కేసులు, గోషా మహల్‌ బీజేపీ అభ్యర్ధి రాజాసింగ్‌పై 43 కేసులున్నాయి. రేవంత్‌ రెడ్డిపై 35, ప్రేమ్‌ సాగరరావుపై 26, ప్రతాపరెడ్డిపై 22, కేటీఆర్ పై 6 కేసులున్నాయి. ఎక్కువ కేసులన్నీ కూడా ఉద్యమాలకు సంబంధించినవే ఉన్నాయి.